ఏటా కోటి కంటే ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలపై పది శాతం పన్ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. దీనిపై శాసనమండలిలో పెట్టిన బిల్లు వీగిపోయింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తరవాత, మండలిలో బిల్లు ప్రవేశపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలు అవలభిస్తోందని ఈ బిల్లుపై పెద్ద దుమారం రేగింది.
కర్ణాటక శాసనమండలిలో ఎన్డీయేకు ఎక్కువ సంఖ్యా బలం ఉంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు 30 మంది ఉండగా, బీజేపీకి 35, జేడీ(ఎస్)కు 8 మంది ఎమ్మెల్సీలున్నారు. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది.
కోటికన్నా ఎక్కువ ఆదాయంపై పది శాతం, 10 లక్షల నుంచి 90 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలపై 5 శాతం పన్ను వేయాలని కర్ణాటక అసెంబ్లీ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీ ఆమోదించింది.