టెట్, డీఎస్సీ నిర్వహణ మధ్య సమయం ఉండేలా చూడాలన్న
పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్ మార్చాలంటూ దాఖలైన
పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, కౌంటర్ దాఖలు
చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
పరీక్షల
మధ్య సమయం ఉండేలా ప్రభుత్వం నొటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించాలంటూ కొందరు హైకోర్టులో
వ్యాజ్యం వేశారు. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య కనీస వ్యవధి నెల
రోజులు ఉండటం సముచితమని హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే
ఆలోచన ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో
ఉపాధ్యాయుల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. టెట్ పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు
నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉంటాయని పేర్కొంది. దీంతో రెండు పరీక్షల షెడ్యూల్ మధ్య వ్యవధి ఉంటే తాము ప్రిపేర్ అయ్యేందుకు సమయం
దొరుకుతుందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.