రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలోకి వంద మందికిపైగా భారత్‌కు చెందిన యువకులను అక్రమంగా తరలించారనే వార్తలు సంచలనంగా మారాయి. రష్యాలో యుద్ధం చేసే సైనికులకు సహాయకులుగా ఉండేందుకు కొందరు భారతీయ యువకులు సంతకాలు చేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీనిపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ పనిచేస్తున్న వారిని విడిపించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు జైస్వాల్ స్పష్టం చేశారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే అంశాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 12 మంది యువకులు దళారుల మాటలు నమ్మి రష్యా వెళ్లారని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు, కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీల నుంచి మరికొందరున్నారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు చెందిన వారు విషయం చెప్పడంతో విదేంశాఖ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం చొరప చూపి బాధితులను స్వస్థలాలకు తీసుకురావాలన్నారు. జాతీయ మీడియా కూడా రష్యాకు భారత యువకుల అక్రమ రవాణాపై కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే కొందరు భారతీయ యువకులు యుద్ధంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. నేపాల్ నుంచి కూడా అక్రమంగా 200 మంది రష్యాకు వెళ్లారనే సమాచారం సంచలనంగా మారింది.