మహాదేవుడి ఆశీస్సులతో కాశీ క్షేత్రం గడిచిన
పదేళ్ళలో అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ
వ్యాఖ్యానించారు. వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ, జ్ఞాన రాజధాని అయిన కాశీ
మరింతగా పురోగమిస్తోందన్నారు. కాశీ క్షేత్ర అభివృద్ధి భారతదేశం మొత్తం
గర్వించాల్సిన విషయమన్న ప్రధాని మోదీ, మహాదేవుడి కృపతో భూమండలం అంతా సస్యశ్యామలంగా
ఉందన్నారు.
వారణాసి పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ
విశ్వవిద్యాలయం(BHU)లో విద్యార్థులను ఉద్దేశించి
ప్రసంగించారు. విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందన్న మోదీ, అమృత్ కాల్ సమయంలో
దేశాభివృద్ధికి మరింత ఊతమిస్తారని ఆకాంక్షించారు. ప్రస్తుతం మహాదేవుడు ఎంతో సంతోషిస్తున్నాడన్న
మోదీ, గడిచిన పదేళ్ళలో కాశీలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. మహాదేవుడే ఆయన
ప్రతినిధులుగా మనతో మంచి పనులు చేయిస్తున్నాడన్నారు.
జ్ఞాన సముపార్జన, శాంతి కోసం దేశంతో
పాటు ప్రపంచ నలుమూలల నుంచి కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది కాశీ కి
వచ్చి స్థిరపడిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఐదేళ్ళలో దేశం మరింత అభివృద్ధి
చెంది ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ విజయవంతమైన అభివృద్ది నమూనాగా భారత్ మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దేవాలయాలు ఆధ్యాత్మికతకు నెలవుగా మారడంతో
పాటు సంగీత, సాహిత్యాలు విరాజిల్లేందుకు దోహదపడ్డాయన్నారు. ధ్యానం, సత్సంగం,
చర్చలు, శోధన జరిగిన ప్రదేశాలకు ఆనవాళ్ళుగా ఆలయాలు నిలిచాయన్నారు.
శివుడి పట్టణమైన కాశీలో బుద్ధిడి
బోధనలు జరిగాయన్నారు. జైన్ తీర్థాంకర్ జన్మస్థలం కావడంతో పాటు ఆదిశంకరులు కాశీలోనే
తన జ్ఞానోదయం పొందిన విషయాన్ని గుర్తు చేశారు.
సన్సద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు
బహుమతులు అందజేసి, విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు. వారణాసి పార్లమెంటు
నియోజకవర్గంలో రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.
సంత్ రవిదాస్ 647 జయంతి
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, విపక్ష కూటమి పై విరుచుకుపడ్డారు. ఇండీ కూటమి
పేదల గురించి కాకుండా కేవలం వారి కుటుంబాల గురించి
మాత్రమే పనిచేస్తోందని దుయ్యబట్టారు.
కులతత్వం పేరిట ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. సంత్ రవిదాస్ ఆలోచనలు తమ ప్రభుత్వం అమలు
చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు పేదలను చివరి వ్యక్తులుగా చూసేవన్న ప్రధాని,
ఎన్డీయే ప్రభుత్వం వారికోసం భారీ పథకాలకు అమలు చేస్తుందన్నారు.
ప్రధాని మోదీ, గురవారం రాత్రే వారణాసి
చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో వారణాసి లో అడుగుపెట్టిన ప్రధాని, కొత్తగా
నిర్మించిన శివ్‌పుర్-పుల్వరీయా-లహ్రతా మార్గ్ ను తనిఖీ చేశారు. యూపీ సీఎం
యోగీతో కలిసి, ఈ మార్గాన్ని ప్రారంభించారు. అంతకు ముందు
వారణాసి వీధుల్లో మోదీ రోడ్‌షో నిర్వహించగా పెద్ద ఎత్తున స్థానికులు ఆయనకు స్వాగతం
పలికారు.