ఆంధ్రప్రదేశ్‌కు
ప్రత్యేకహోదా సాధించడంలో వైసీపీ, టీడీపీలు ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ రాష్ట్ర
అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు, సీట్ల
సర్దుబాటు అజెండాగా నేడు విజయవాడలో జరిగిన సమావేశంలో
పాల్గొన్న షర్మిల, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ లో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం బాధాకరమన్నారు.
పదేళ్ళుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల కారణంగా విభజన హామీలు
ఒక్కటి కూడా నెరవేరలేదని ఆరోపించారు. టీడీపీ, వైసీపీలు బీజేపీ మెప్పు కోసమే పాకులాడుతున్నాయని
విమర్శించిన షర్మిల, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.
గతంలో
చంద్రబాబు ఎన్డీయేలో చేరి మంత్రి పదవులు తీసుకున్నారని, హోదా వద్దు అని ప్యాకేజీ తో
సరిపెట్టుకున్నారని గుర్తు చేశారు. అధికారమిస్తే హోదా తెస్తామన్న వైఎస్ జగన్ కూడా
ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని దుయ్యబట్టారు.
అమరావతి పేరిట చంద్రబాబు త్రీడీ
గ్రాఫిక్స్ చూపితే జగన్, రాజధానినే లేకుండా చేశారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం
నిర్మాణం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా
విఫలమైందన్నారు.