ED raids in six locations of Sheik Shahjahan in WBrelated
to PD scam
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌కు సంబంధించిన ప్రజాపంపిణీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఈ తెల్లవారుజామున ఆరు ప్రదేశాల్లో సోదాలు
ప్రారంభించింది. ఈడీ, ఈ నెల 29న జరపబోయే దర్యాప్తుకు ఆదేశించాలంటూ షాజహాన్‌కు నిన్ననే
తాజా సమన్లు జారీ చేసింది. అంతలోనే ఈ ఉదయం సోదాలు మొదలయ్యాయి.
షేక్ షాజహాన్ పేరు ఇటీవల వివాదాస్పదమైంది. గత
నెలలో ఈడీ అధికారులు సోదాలకు వచ్చినప్పుడు షాజహాన్, అతని అనుచరులు వారిపై దాడులకు
పాల్పడడం సంచలనం సృష్టించింది. ఆ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
స్థావరంగా షాజహాన్ గ్యాంగ్ స్థానిక హిందూమహిళలపై చేస్తున్న అత్యాచార ఘటనలు
వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ షాజహాన్ పరారీలో ఉన్నాడు. అతని ఇద్దరు ప్రధాన
అనుచరులను అరెస్ట్ చేసారు.
కేంద్ర బలగాల సహాయంతో ఈడీ అధికారులు ఇవాళ
తెల్లవారుజాము నుంచీ సోదాలు ప్రారంభించారు. గతనెలలో కూడా ఈడీ ఇదే కేసుకు సంబంధించి
రెండు వేర్వేరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. వాటిలో సందేశ్‌ఖాలీలోని షాజహాన్
నివాసం కూడా ఒకటి.
జనవరి 5న ఈడీ సోదాలు చేయడానికి షాజహాన్ ఇంటికి, మరో
టీఎంసీ నేత శంకర్ ఆద్య నివాసానికీ వెడుతుండగా ఈడీ అధికారులపై దాడులు జరిగాయి. షాజహాన్
అనుచరులైన సుమారు 2వందల మంది కార్యకర్తలు అధికారులను, సాయుధ పారామిలటరీ బలగాలను
చుట్టుముట్టారు. షాజహాన్ ఇంట్లో సోదాలు చేయకుండా అడ్డుకున్నారు. ఆ ఘర్షణల్లో ఇద్దరు
ఈడీ అధికారులు గాయపడ్డారు.
ఆ ఘటన రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలకు
దారితీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ బీజేపీ నాయకులు
మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు. అదే సమయంలో టీఎంసీ
నాయకులు ఈడీయే స్థానిక ప్రజలను రెచ్చగొడుతోందంటూ నిరాధార ఆరోపణలు చేసారు.
ఆ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్రహోంశాఖ పశ్చిమబెంగాల్
ప్రభుత్వాన్ని కోరింది.
ఈడీ ఇప్పుడు చేస్తున్న సోదాలు రాష్ట్రంలో కొన్నాళ్ళ క్రితం చోటుచేసుకున్న
ప్రజాపంపిణీ కుంభకోణానికి సంబంధించినవి. ఆ కేసులో బెంగాల్ మాజీ పౌరసరఫరాల శాఖ
మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌ను 2023 అక్టోబర్‌లో అరెస్ట్ చేసారు.
ఈ కేసు విచారణ
మొదలైనప్పటినుంచీ షాజహాన్ పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడన్న విషయాన్ని కేంద్ర,
రాష్ట్ర బలగాలేవీ ఇప్పటివరకూ గుర్తించలేకపోయాయి. ఇటీవలే కలకత్తా హైకోర్టు,
సీబీఐ-పశ్చిమబెంగాల్ పోలీసులు ఉమ్మడిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు
చేసి, ఈడీ అధికారులపై సందేశ్‌ఖాలీలో జరిగిన దాడి ఘటనను విచారించాలని ఆదేశించింది.
ఆ టీమ్ ఫిబ్రవరి 12లోగా తమ విచారణ ఫలితాలను హైకోర్టుకు తెలియబరచాలి.