మేడారం
జనసంద్రంగా మారింది. వనజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క ప్రతిరూపాన్ని
మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించి మేడారం గద్దెపైకి చేర్చారు. సారలమ్మ,
పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇప్పటికే గద్దెలపైకి చేరడంతో జాతర లో కీలకఘట్టం
ఆవిష్కృతమైంది.
వనజాతర
లో ప్రధాన ఘట్టం సమ్కక్క ఆగమనమే. దీంతో మేడారంలోని సమ్మక్క గుడి శక్తిపీఠం వద్ద
పూజారులు, వడ్డెలు.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ, గోవిందరాజులు,
పగిడిద్దరాజుకు పసుపు, కుంకుమ అప్పగించిన తర్వాత చిలకలగుట్టకు చేరుకున్నారు.
అక్కడ
పూజారులు కుంకుమభరిణె, బంగారు కడియాలకు ఆదివాసీ సంప్రదాయాల మేరకు రెండు గంటల పాటు
ప్రత్యేక క్రతువు నిర్వహించారు.
ప్రజలను చల్లగా చూడాలని గద్దెపైకి రావాలని
అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అమ్మవారి సమ్మతి మేరకు 100 మీటర్ల దూరంలో ఉన్న
క్రిష్ణయ్యకు మదిరిగుడ్డ(ఎర్రవస్త్రం)లోని అమ్మవారి ప్రతిరూపాన్ని అప్పగించారు.
దీంతో పూజారి క్రిష్ణయ్యను శక్తి అవహించింది. అక్కడి నుంచి గుట్టకిందకు తీసుకురాగానే
ములుగు ఎస్పీ శబరీశ్, ఏకే-47 తో గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి స్వాగతం
పలికారు. అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య అమ్మవారిని గద్దెపైకి తీసుకొచ్చారు.
బుధవారం
రాత్రి 12.12గంటలకు సారలమ్మ, ఆ తర్వాత గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెపైకి
చేరారు. గురువారం రాత్రి 9.29కి సమ్మక్క గద్దెపైకి చేరింది. గురువారం ఒక్కరోజే
వనదేవతలను 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.