మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. 86 సంవత్సరాల జోషి రెండు రోజుల కిందట గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు హిందుజా ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం మనోహర్ జోషి అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో చికిత్సకు స్పందించలేదని డాక్టర్లు తెలిపారు.
శివసేనలో కీలక నేతగా గుర్తింపు పొందిన జోషి 1995 నుంచి నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002 నుంచి రెండేళ్లపాటు లోక్సభ స్పీకర్గాను సేవలందించారు. 1937 డిసెంబరు 2న మహారాష్ట్రలోని నాంద్వీలో జోషి జన్మించారు. ముంబయిలో చదువు పూర్తి చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తితో జీవితం ప్రారంభించిన జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు.