స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీ నష్టాలతో మొదలైనా పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. తీవ్ర నష్టాల నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకున్నా, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను కొనసాగిస్తున్నాయి.
ప్రారంభంలో సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టాలతో మొదలైంది. మధ్యాహ్నం సమయానికి కొనుగోలుదారుల నుంచి గట్టి మద్దతు లభించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి, 73256 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్ల లాభంతో 22217 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, యాక్సిక్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ లాభాలార్జించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ స్వల్పంగా తగ్గింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ రూ.82.84 వద్ద ట్రేడవుతోంది.