భారత్
జోడో యాత్రలో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ వరుస
ఓటములతో రాహుల్ గాంధీ తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే ఐశ్వర్యా రాయ్‌ను కించపరిచే స్థాయికి దిగజారారని
బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ఘనతలు సాధించని రాహుల్ గాంధీ, దేశానికి
కీర్తి తెచ్చిన ఐశ్వర్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
రాహుల్
వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్
చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారా లేక పదవి కోసం మౌనంగా ఉండి పోతారా అని కర్ణాటక బీజేపీ,
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.
భారత్
జోడో యాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠను
ప్రస్తావించారు. అక్కడ ఓబీసీ వర్గానికి చెందిన వారు ఒక్కరైనా కనిపించారా అని ప్రజలను
ప్రశ్నించారు.
అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా
రాయ్, నరేంద్రమోదీ వంటివారు మాత్రమే ఉన్నారన్నారు.
శ్రీమంతులు, బాలీవుడ్ నటులు మాత్రమే ఆ వేడుకలో
ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్ బచ్చన్ మాత్రమే
పాల్గొన్నారు. ఐశ్వర్యా రాయ్ హాజరుకాలేదు.
ఐశ్వర్య
పేరు ప్రస్తావిస్తూ గతంలో రాహుల్ చేసిన ప్రసంగాలను కొన్నింటిని బీజేపీ పోస్టు
చేసింది. ‘టీవీ ఛానెళ్లు ఐశ్వర్య నృత్యాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. పేదప్రజల
స్థితిగతుల గురించి ఎలాంటి ప్రసారాలు చేయడం లేదు’ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను సింగర్
సోనా మహాపాత్ర తీవ్రంగా ఖండించారు. తమ ప్రయోజనాల కోసం రాజకీయనేతలు ఇతరులను
కించపర్చడం తగదన్నారు.