Karnataka Government imposes 10pc tax on Hindu temples
కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
హిందువులపై తమ ప్రతాపం చూపిస్తోంది. ముస్లిములకు వందల తాయిలాలు ఆశపెట్టి ఎన్నికల్లో
గెలిచిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వపు హిందూ వ్యతిరేకతను నానారకాలుగా
చూపుతోంది. ఆ క్రమంలో తాజా అక్రమం… గుడులపై పన్ను.
కర్ణాటక శాసనసభ బుధవారం నాడు ‘కర్ణాటక హిందూ రెలిజియస్
ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బిల్ 2024ను ఆమోదించింది. ఆ బిల్లులో
హిందూ దేవాలయాల ఆదాయం మీద 10శాతం పన్ను విధించడానికి ఏర్పాటు చేసింది.
హిందువుల జేబులకు ఇప్పటికే కన్నం పెడుతూ ఆ డబ్బులతో
ఇతరమతాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా
హిందువుల దేవాలయాల మీద పన్ను విధించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్
ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అంటూ మండిపడింది.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిందూ దేవాలయాల డబ్బులతో తమ ఖాళీ ఖజానాను
నింపుకోడానికి చూస్తోందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అదేపనిగా హిందూ
వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. ఇప్పుడు వారి దృష్టి దేవాలయాల మీద పడింది.
ఎండోమెంట్స్ బిల్లు ద్వారా తన ఖాళీ ఖజానాను నింపుకోడానికి గుడులను దోచుకోవాలని
భావిస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండోమెంట్స్
బిల్లు 2024, దేవాలయాలకు కోటి రూపాయల కంటె ఎక్కువ ఉండే ఆదాయం మీద 10శాతం పన్ను
విధిస్తోంది. జైనుల మందిరాలకు కూడా కోటి రూపాయల కంటె ఎక్కువ వచ్చే ఆదాయం మీద
10శాతం పన్ను, పది లక్షల నుంచి కోటి రూపాయల లోపు వచ్చే ఆదాయం మీద 5శాతం పన్ను
విధించింది. భక్తులు గుడులకు ఇచ్చే విరాళాలు, మొక్కుబడులతో దేవాలయాల
పునర్నిర్మాణం, భక్తులకు వసతులు కల్పించాలి. కానీ వాటిని మరోవిధంగా ఉపయోగించడం
భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడమేనని విజయేంద్ర యడ్యూరప్ప మండిపడ్డారు. ప్రభుత్వం
కేవలం హిందూమందిరాలనే ఎందుకు లక్ష్యం చేసుకుంటోందని నిలదీసారు.
కర్ణాటక ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం
ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వక్ఫ్ బోర్డుకు వంద కోట్లు, క్రైస్తవ సమాజానికి 2వందల
కోట్లు ప్రకటించింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దానిపై స్పందిస్తూ… కర్ణాటక
ప్రభుత్వం హిందూ ప్రజల డబ్బులతో ఇతర మతాలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందన్నారు.
హిందూ దేవాలయాల నుంచి ఇప్పటికే సుమారు 445 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది, అందులో
హిందూ దేవాలయాల కోసం కేవలం 100 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వపు తాజా ఎండోమెంట్స్
బిల్లు రాజకీయ రగడకు దారి తీసింది. హిందూ దేవాలయాలపై పది శాతం పన్ను విధించడాన్ని
బీజేపీ తప్పుపడుతోంది. అయితే కాంగ్రెస్ మంత్రి రామలింగారెడ్డి, బీజేపీ మతంతో
రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హిందూమతానికి నిజమైన సేవ చేస్తున్నది కాంగ్రెస్
పార్టీ మాత్రమేనని చెప్పుకున్నారు. ఒకపక్క హిందూ దేవాలయాల డబ్బులు దోచుకుంటూ
వాటిని ఇతర మతాలకు దోచిపెడుతూ ఇప్పుడు మళ్ళీ దేవాలయాల ఆదాయం మీద పన్ను విధించి
పైగా, అదంతా హిందూమతానికి మేలు చేయడమేనని చెప్పుకోవడం కాంగ్రెస్‌కే చెల్లింది.