Uyyalavada
Narasimha Reddy, First Generatio Freedom Fighter
(నేడు ఉయ్యాలవాడ
నరసింహారెడ్డిని తెల్లదొరలు ఉరితీసిన దినం)
ఆంగ్లేయుల పాలన నుంచి మనదేశానికి
విముక్తి విముక్తి కలిగించాలని తమ సర్వస్వాన్నీ ఒడ్డిన అనేకమంది వీరులలో
అగ్రగణ్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లప్రభుత్వాన్ని గడగడలాడించిన
వీరాధివీరుడు, పరాక్రమశాలి, అంతకుమించి కరుణామయుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఉత్తరభారతదేశంలో 1857లో స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంటే, ఆంధ్రప్రాంతంలోని
రాయలసీమలో 1847లోనే ఆంగ్ల నిరంకుశ పాలనను ఎదిరించి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన
వీరసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
రేనాడుగా పిలువబడే రాయలసీమ
ప్రాంతంలోని సంస్థానాలను పరిపాలించేవారిని పాలెగాళ్ళు అనేవారు. నొస్సం సంస్థాన
పాలెగానిగా జయరామిరెడ్డి ఉండేవాడు. ఆ జయరామిరెడ్డి అల్లుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
సంస్థాన పాలెగాడైన పెదమల్లారెడ్డి, జయరామిరెడ్డికి సంతానం లేకపోవడం వలన
మల్లారెడ్డి కుమారుడైన నరసింహారెడ్డిని, అనగా మనుమడిని దత్తత తీసుకుని, 66
గ్రామాలు కలిగిన నొస్సం సంస్థానానికి పాలెగానిగా చేసాడు. అప్పటివరకూ నిజాం
ప్రభువుల అధీనంలో ఉన్న రాయలసీమను నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీకి అప్పగించాడు.
ఇంక కంపెనీ ఒక్కో సంస్థానాన్నీ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. జయరామిరెడ్డి
చనిపోయిన తర్వాత దత్తత స్వీకారం చెల్లదన్న నెపంతో ఈస్టిండియా కంపెనీ నరసింహారెడ్డికి
రావలసిన 11రూపాయల 10అణాల 8పైసల భరణమును నిలిపివేసింది. 1846 జూన్ నెలలో తనకు
రావలసిన భరణం కోసం ఉయ్యాలవాడ పాలెగాడైన నరసింహారెడ్డి కోయిలకుంట్ల తహసీల్దార్
వద్దకు తన అనుచరులను పంపించాడు.
అయితే ఆ తహసీల్దారు వచ్చిన
ఆ అనుచరులతో… ఆ నరసింహారెడ్డే ఒక బిచ్చగాడు, మీరు వాడికి బిచ్చగాళ్ళా? అంటూ నానా
దుర్భాషలాడి అవహేళన చేసి అవమానించి, నరసింహారెడ్డి స్వయంగా వచ్చి చెయ్యి జాపితేనే
భరణం ఇవ్వగలనని చెప్పి పంపాడు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి
ఆగ్రహోదగ్రుడై 1846 జులై 10న పెద్ద సంఖ్యలో బోయలను కలుపుకుని కోయిలకుంట్ల
తహసీల్దారుపై దాడికి వెళ్ళెను. ఆ సేనను చూసిన వెంటనే పారిపోవుటకు సిద్ధపడిన తహసీల్దారుపై
దాడి చేసి, అతని తల నరికి కచేరీని దగ్ధం చేసి అక్కడ నుంచి ఖజానాకు వెళ్ళి అడ్డొచ్చిన
ఖజానా అధికారితో ‘మూర్ఖునికి మృత్యువే మందు’ అంటూ అతని తలను కూడా నరికి తనకు రావలసిన
భరణం తాలూకు డబ్బు తీసుకొని, ఆ రెండు తలలనూ అటవీప్రదేశంలోని శివాలయం వద్ద
పాతిపెట్టెను. ఆ అధికారుల తలల కోసం పోలీసులు తీవ్రంగా గాలించి జాడ తెలిసికొని
దానికి కారకుడైన నరసింహారెడ్డిని బంధించుటకై వాట్సన్, నాట్ అనే ఆంగ్ల
ఉన్నతాధికారుల నాయకత్వంలో పోలీసు బలగం బయలుదేరింది. అంతేకాదు, నరసింహారెడ్డిని
పట్టి ఇచ్చినవారికి రూ.1000 బహుమానమని కూడా ప్రకటన చేసారు.
అయితే నరసింహారెడ్డి అనుచరులైన
బోయలు, ఇతరులు కూడా కత్తులు ఝళిపిస్తూ ఈటెలు, బల్లెములు విసురుతూ ఒడిసెలు తిప్పుతూ
పోలీసులపై తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. కానీ ఆధునిక ఆయుధాలు, బలగాలు ఉన్న ఆంగ్ల
పోలీసుల ముందు బోయ సేన నిలువలేక తీవ్రంగా నష్టపోయింది. నరసింహారెడ్డి నొస్సం
కోటలోని గుహ ద్వారా నల్లమల అడవులకు చేరుకుని ఓ పురాతన దేవాలయమునకు చేరుకున్నాడు.
విశ్వప్రయత్నం చేసిన మీదట ఆంగ్ల అధికారులు నరసింహారెడ్డికి ఆహారం పంపే వ్యక్తిని
బెదిరించి నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకొని కొక్రేన్ అనే ఆంగ్ల అధికారి నాయకత్వంలో
1846 అక్టోబర్ 6వ తేదీన ఆ దేవాలయంపై దాడి చేసి, అడ్డువచ్చిన అనుచరగణాన్ని హతమార్చి
నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తీసుకునివచ్చి 1847 ఫిబ్రవరి 22న బహిరంగంగా
ఉరితీసి ఆంగ్లేయులను ఎదిరించినవారికి ఇదే గతి అని హెచ్చరిస్తూ, అతని తలను
కోయిలకుంట్ల కోటగుమ్మానికి వ్రేలాడదీసి 30 సంవత్సరాల పాటు అలానే ఉంచారు.
1806
నవంబర్ 24న జన్మించిన నరసింహారెడ్డి జీవించింది కేవలం 40 సంవత్సరాలే. ఇప్పటికీ
రాయలసీమ ప్రాంతంలో గుబురుమీసాలు, మూడు నామాలతో ఖడ్గధారి, రాజసం ఉట్టిపడే ఆజానుబాహుడైన
నరసింహారెడ్డి వీరగాధను రాయలసీమ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ జానపద
కళారూపాలలో పాడుకుంటూంటారు.