POJK Sankalp Diwas: Destruction
of Hindu temples in POJK
జమ్మూకశ్మీర్ విషయంలో భారతదేశ విధానంలో 1994
ఫిబ్రవరి 22 ఒక ప్రత్యేకమైన రోజు. మూడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదేరోజు
పార్లమెంటులో ఒక విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ అక్రమంగా కబ్జా చేసిన
జమ్మూకశ్మీర్ భూభాగంపై అధికారం అంతా భారతదేశానిదే అని ఆరోజు స్పష్టం చేసారు. పాక్
ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారతదేశం అంతర్భాగమనీ, పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని వదిలివేయాలనీ
పార్లమెంటు స్పష్టంగా ప్రకటించింది. పాకిస్తాన్ మొత్తం 78వేల చదరపు కిలోమీటర్ల
భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. ఉత్తరాన ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్,
వాయవ్యాన పూంఛ్, మీర్పుర్, ముజఫరాబాద్ అన్నీ కలిపి పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్
అవుతుంది.
అక్టోబర్ 1947లో పాకిస్తాన్ నుంచి అటవీతెగలకు
చెందిన వారు జమ్మూకశ్మీర్ భూభాగం మీద మోసపూరితంగా దాడి చేసారు. ఆధునిక ఆయుధాలు
ధరించిన పాకిస్తానీ సైన్యం కూడా వారిలో కలిసిపోయింది. దాన్నిబట్టే ఆ దాడి పాక్
సైన్యం భారత్‌కు వ్యతిరేకంగా రచించిన కుట్ర అని అర్ధమవుతుంది. ఆ దాడిలో హిందువులు,
సిక్కులను ఊచకోత కోసారు. ఆ దాడిలో 30వేల మందికి పైగా చనిపోయారు, లక్షమందికి పైగా
శరణార్థులయ్యారు.
పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూకశ్మీర్ ప్రాంతంలో
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకూ హిందువుల జనాభాయే ఎక్కువగా ఉండేది. అందువల్ల
హిందువులు, బౌద్ధులు, సిక్కుల ప్రార్థనాస్థలాలు ఎక్కువగా ఉండేవి. విదేశీ
ఆక్రమణదారులు చొరబడ్డాక చేసిన విధ్వంసాల్లో పేరుకి కొన్ని గుడులు మిగిలాయి,
బౌద్ధుల మందిరాలు, సిక్కుల గురుద్వారాలు దాదాపు అన్నీ నాశనమైపోయాయి. ఇక స్వతంత్రం తర్వాత
పాకిస్తాన్ ఆక్రమించాక, మిగిలిన హిందూ దేవాలయాలను కూడా ధ్వంసం చేసేసారు. పాక్
ఆక్రమిత కశ్మీర్ అంతా ఇస్లామిక్ ఛాందసవాదులు, ఉగ్రవాదుల కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు
చాలా కొద్దిగా మాత్రమే దేవాలయాలు, ముస్లిమేతరుల ప్రార్థనాస్థలాలు మిగిలున్నాయి.
వాటి వివరాలు చూద్దాం.
నీలమ్ లోయలోని శారదా పీఠం
పాకిస్తాన్ అక్రమంగా కబ్జా
చేసిన జమ్మూకశ్మీర్ భూభాగంలోని ప్రముఖ దేవాలయం మాతా శారదా పీఠం. ఆ గుడి
వాస్తవాధీన రేఖ దగ్గర నీలమ్ లోయలో ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఆలయాన్ని పూర్తిగా
ఉపేక్షించింది. బాగా శిథిలమైపోయి జీర్ణావస్థలో ఉన్న శారదా పీఠాన్ని పాకిస్తాన్
సైన్యం ఆక్రమించిందనీ, అక్కడ ఒక కాఫీషాప్ తెరిచిందనీ 2023 డిసెంబర్లో వార్తలు
వచ్చాయి.
హిందూ పురాణాల్లో ఆ
శారదా పీఠ మందిరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సతీదేవి మరణం తర్వాత ఆమె శవాన్ని
పట్టుకుని పరమశివుడు తాండవ నాట్యం చేసాడు. ఆ సమయంలో సతీదేవి శరీరంలోనుంచి కుడిచెయ్యి
అక్కడ పడింది. ఆ ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. చారిత్రకంగా చూసుకుంటే ఆ శారదా
పీఠ ఆలయానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు గొప్ప శిల్పసౌందర్యంతో అలరారిన
ఆ ఆలయం ఇవాళ దుండగుల చేతిలో పడి శిథిలావస్థలో బలహీనంగా ఉంది. సోమనాథ్‌లోని
శివాలయానికి ఉన్నంత మహత్వం ఈ శారదా పీఠానికి కూడా ఉంది. ఈ గుడికి 19వ శతాబ్దంలో ఆఖరిసారి
మరమ్మతులు జరిగాయి. మహారాజా గులాబ్‌సింగ్ ఆ మరమ్మతులు చేయించారు. ఈ గుడి దగ్గరున్న
మాదోమతి సరోవర జలాలు పరమ పవిత్రమైనవని ప్రజల విశ్వాసం.
ఈ శారదా పీఠం
దక్షిణాసియాలోనే అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠ దేవాలయం. పాకిస్తాన్ ఆక్రమణలో
ఉన్నందున భారతీయులెవరూ అక్కడకు సులువుగా వెళ్ళలేరు. 1948 వరకూ గంగా అష్టమి పర్వదినాన
శారదాపీఠ యాత్ర మొదలయ్యేది. కానీ ఆ తర్వాత
పరిస్థితులు ఎంతలా పాడైపోయాయంటే అక్కడికి భక్తులు వెళ్ళడానికి అవకాశమే లేకుండా
పోయింది.
పాక్
ఆక్రమిత కశ్మీర్‌లోని శివాలయం
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని
శివాలయం ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఆ గుడి ఎప్పుడు నిర్మించారన్న
దానికి ఎలాంటి ఆధారాలూ లేవు. 1947 భారతదేశ విభజన తర్వాత కొంతకాలం పాటు ఆ గుడి
పరిస్థితి మామూలుగానే ఉండేది. కానీ రెండు దేశాల మధ్యా రాజకీయ సంబంధాలు, బంధాలూ
దెబ్బతినడంతో ఆ ఆలయానికి దుర్దశ ప్రాప్తించింది. గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో అతివాదుల
ప్రాబల్యం పెరగడంతో భక్తుల రాకపోకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆ గుడి
ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది.
బ్రిడ్జి
నిర్మాణంలో నీట మునిగిన ఆలయం
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని
మీర్పుర్ నగరంలో చాలా గుడులు ఉండేవి. వాటిలో చాలా గుడులు మంగళా బ్రిడ్జి
నిర్మాణంతో నీట మునిగిపోయాయి. నేటికీ మంగళా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గినప్పుడు
మంగళాదేవి మందిరం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రిప్ అడ్వైజర్ వంటి పర్యాటక
పుస్తకాల్లో సైతం మీర్పుర్లో ఒక శివాలా మందిరం, బాణగంగ మందిరం గురించి వివరాలు
దొరుకుతాయి. అక్కడ ఇప్పటికీ మంగళ కోట, రాజ్‌కోట్ కోట ఇప్పటికీ ఉన్నాయి.
అలాగే పీఎఓజేకేలోని పూంఛ్
ప్రాంతంలో ఒక గలీ దేవీ మందిరం ఉంది. గలీ దేవి ప్రాంతంలో దేవదారు అడవులు, కొండప్రాంతాల
మధ్యలో పచ్చటి మైదానం ఉంది. దేవీ గలీ అనే పేరు ఈ ప్రాంతాన్ని బట్టి వచ్చింది.
స్థానిక ప్రజల కథనం ప్రకారం పాక్ ఆక్రమణలకు ముందు ఆ ప్రాంతం హిందువులకు పరమపవిత్రమైన
పూజాస్థలం. ఇప్పుడా ప్రాంతం అంతా కళాకాంతీ లేకుండా తయారైంది.
మీర్పుర్
రఘునాథ మందిరం
పీఓజేకేలో జీలం నది ఒడ్డున
మీర్పుర్లో ఉన్న రఘునాథ మందిరం ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. పూర్తిగా
శిథిలావస్థకు చేరుకుంది. పాకిస్తానీ ప్రభుత్వం ఆ
ప్రదేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రదేశం ఇప్పుడు ఇస్లామిక్
అతివాదులు, ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు మీర్పుర్లో హిందువులు సంఖ్య
ఎక్కువ. 1947 తర్వాత అక్కడ హిందూ జనాభా 20శాతానికి పడిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ
ఒక్కశాతమైనా హిందువులు లేరు.
పాఠశాలగా
మారిపోయిన అలీబేగ్ గురుద్వారా
పీఓజేకేలోని బింబేర్
జిల్లాలో మీర్పుర్-జీలం లింక్ రోడ్ మీద ఉన్న అలీబేగ్ గురుద్వారా ఒకప్పుడు
సిక్కులకు అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. దాన్నిప్పుడు పాకిస్తానీ అధికారులు మొహమ్మద్
యాకూబ్ షహీద్ హైస్కూల్ ఫర్ గర్ల్స్‌గా మార్చేసారు.
కర్‌గాహ్
బుద్ధస్థలం
పాకిస్తాన్ ప్రభుత్వం
ఉదాసీన వైఖరి వల్ల పాడైపోతున్న పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రదేశాల్లో ఒకటి కర్‌గాహ్
బుద్ధ స్థలంలో ఉన్న నగిషీలు చెక్కిన ప్రతిమ. ఆ ప్రదేశం గిల్గిట్‌కు సుమారు 6 మైళ్ళ
దూరంలో ఉంది. అక్కడ నిలబడి ఉన్న ఆకృతిలో ఒక విగ్రహం ఉంది. అది 7వ శతాబ్దానికి
చెందినదని చెబుతారు. గిల్గిట్‌లో మాట్లాడే శిన్ భాషలో ఆ విగ్రహాన్ని ‘యశన్’ లేదా
‘యక్షిణి’ అంటారు. ఆ విగ్రహం కూడా మెలమెల్లగా క్షయమైపోతోంది.
స్కర్దూ
ప్రాంతంలోని శ్రీ ఛోటా నానకియానా సాహిబ్ గురుద్వారా
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో
స్కర్దూ ఒక ప్రసిద్ధ నగరం. అది లాహోర్‌కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.
స్కర్దూ నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఒక చిన్న కొండ మీద ఒక పెద్ద భవనం ఉంది. దాన్ని
గురుద్వారా శ్రీ ఛోటా నానకియానా సాహిబ్ అని పిలుస్తారు. ఇవాళ ఆ గురుద్వారా పాక్
ప్రభుత్వపు ఉదాసీనత కారణంగా ధ్వంసమైపోతోంది. గురునానక్ చైనా నుంచి వెనక్కు వస్తున్నప్పుడు
ఆ ప్రదేశంలో ఆగారని స్థానికుల కథనం. అందుకే ఆ చోటును స్థానికులు ‘అస్థాన్ నానక్
పీర్’ అని కూడా అంటారు. గురుద్వారాలోని కొన్ని భాగాలు కూలిపోవడం మొదలైంది. ఆ భవనం పూర్తిగా
శిథిలమైపోడానికి ఇంకెంతో కాలం పట్టదు.
ఈ ప్రాంతాలన్నీ వాటంతట అవి
శిథిలం అయిపోలేదు. పాకిస్తాన్ ప్రత్యేకదేశంగా ఏర్పడ్డాక జమ్మూకశ్మీర్‌లోని ఈ
భాగాన్ని ఆక్రమించుకున్నాక పాక్ ప్రభుత్వం, ముస్లిం ఛాందసవాదులూ కలిసి ముస్లిమేతర
పూజాస్థలాలన్నింటినీ మట్టిలో కలిపేయాలని ఒక పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఆ క్రమంలోనే గత 76ఏళ్ళలో పీఓజేకేలోని గుడులు, బౌద్ధస్థలాలు, గురుద్వారాలను చరిత్రనుంచి
తొలగించారు. అయినా అవశేష రూపంలో మిగిలిన అతికొద్ది ముస్లిమేతర ప్రార్థనాస్థలాలు,
భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రచించిన కుట్రను బహిర్గతం చేస్తున్నాయి.