రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం బుధవారంనాడు హింసాత్మకంగా మారడంతో కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొంటోన్న 177 మంది రైతుల ఎక్స్ ఖాతాలు నిలిపేయాలని ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు వారి ఖాతాలు నిలిపేసినట్లు ఎక్స్ ప్రకటించింది. అయితే తమ వేదికపై అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
తమ పాలసీని వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయం ఉండటంపై ఎక్స్ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించారు.దానిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఖాతాలు నిలిపివేసిన ఖాతాదారులకు నోటీసులు కూడా అందించినట్లు ఎక్స్ తెలిపింది. కొన్ని చట్టాల వల్ల ప్రభుత్వ ఆదేశాలు బహిర్గతం చేయలేమని ఎక్స్ వెల్లడించింది.
ఢిల్లీ చలో కార్యక్రమం బుధవారంనాడు ఖనౌరీ వద్ద హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడంతో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఓ రైతు చనిపోయాడు. ఢిల్లీ చలో కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులకు చెందిన 177 ఎక్స్ ఖాతాలు నిలిపేయాలని కేంద్ర ఐటీ శాఖ ఎక్స్‌ను కోరింది. ఆ మేరకు వారి ఖాతాలు నిలిపేసినట్లు ఎక్స్ ప్రకటించింది.