AP CM YS Jagan participates in Havan and Poojas at Sarada Peetham Vizag
విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని శ్రీ
శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
పీఠంలో నిర్వహించిన రాజశ్యామలయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక
పూజలు నిర్వహించారు.
పీఠంలోని రాజశ్యామలాదేవి, వల్లీదేవసేనా సహిత
సుబ్రహ్మణ్యస్వామి, వనదుర్గాదేవి మూర్తులను జగన్ దర్శించుకుని పూజలు చేసారు. మన్యుసూక్తంతో
నిర్వహించిన హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జగన్ సుమారు
గంట పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడిపారు. ముఖ్యమంత్రికి శారదాపీఠాధిపతి
స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాగతం
పలికారు. దగ్గరుండి దేవీదేవతల దర్శనాలు చేయించారు. ముఖ్యమంత్రితో హోమం, పూజలు
చేయించారు. మరికొన్ని వారాల్లో రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న
తరుణంలో జగన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆసక్తి కలిగించే రాజకీయ పరిణామమే.
రాజశ్యామల యాగాన్ని
రాజ్యాలు గెలుచుకోడానికీ, అధికారం సాధించడానికీ చేస్తారని చెబుతారు. శారదాపీఠం
అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ యాగాన్ని గతంలో జగన్‌తోనూ, తెలంగాణలో కేసీఆర్‌తోనూ
చేయించారు. ప్రత్యేకించి 2019 ఎన్నికల ముందు జగన్ ఈ స్వామితో సన్నిహితంగా
ఉండేవారు. దాంతో ఈ స్వామి జగన్‌ను హిందూమతంలోకి మతమార్పిడి చేసారన్న ప్రచారం కూడా
విస్తృతంగా జరిగింది. అందువల్లనే క్రైస్తవుడైన జగన్, తమకూ దగ్గరివాడేనన్న
అభిప్రాయం హిందువుల్లో కలిగిందనీ, అది ఎన్నికల్లో లాభించిందనీ చెబుతుంటారు.
కొద్దిరోజుల క్రితమే స్వరూపానందను జగన్ పట్టించుకోవడం లేదంటూ కొన్ని తెలుగు
మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.