Kerala Governor slams CPM govt in harsh tone
కేరళలో అధికారంలో ఉన్న సీపీం ప్రభుత్వానికి నిషిద్థ
ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐతో సంబంధాలున్నాయంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
ఆరోపించారు. పార్టీ విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐ ద్వారా పినరయి విజయన్ ప్రభుత్వం పీఎఫ్ఐతో
సంబంధాలు నెరపుతోందన్నారు.
కేరళ ప్రభుత్వం పగలు ఎస్ఎఫ్ఐతో, రాత్రి పీఎఫ్ఐతో సంబంధాలు
నెరపుతోందంటూ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ – పిఎఫ్ఐ సంబంధాల గురించి
కేరళ ప్రజల నుంచి తను చాలా విషయాలు విన్నానని గవర్నర్ చెప్పారు. ఇప్పటికిప్పుడు
పేర్లు చెప్పబోననీ, కానీ కేంద్రప్రభుత్వ నిఘాసంస్థల దగ్గర వివరాలు ఉన్నాయనీ
గవర్నర్ అన్నారు.
గత నెల తనకూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకూ మధ్య ప్రత్యక్షంగా
జరిగిన గొడవలో అరెస్టయిన వారిని చూస్తేనే ఆ విషయం అర్ధమైపోతుందని గవర్నర్
చెప్పారు. కేరళలోని కొల్లాం జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఎస్ఎఫ్ఐ
కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ని నిలిపివేసారు. దాంతో ఆగ్రహించిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్
వెంటనే తన కాన్వాయ్ నుంచి దిగి రహదారి మీదే కూర్చుండిపోయారు. నల్లజెండాలతో
ప్రదర్శన చేపట్టిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను, తన దగ్గరకు రావాలని ఛాలెంజ్ చేసారు.
‘‘ప్రభుత్వ ఏజెన్సీలకు వాస్తవాలు తెలుసు. నామీద
దాడి కేసులో అరెస్టయిన 15మందిలో సగం మందికి పైగా పీఎఫ్ఐ క్రియాశీల కార్యకర్తలే.
వారికి ఇలాంటి దాడులు చేయడం కొత్తేమీ కాదు. నిజానికి కేరళ పోలీసు విభాగమే పీఎఫ్ఐని
వాడుకుంటున్నారన్న ఆరోపణలు రాష్ట్ర శాసనసభలోనే వినిపించాయి’’ అని గవర్నర్ ఆరిఫ్
మహ్మద్ ఖాన్ చెప్పారు. పిఎఫ్ఐతో పినరయి విజయన్ సంబంధాల గురించి కేరళ ప్రజలు చాలా
మామూలుగా మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు.
తనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సంఘటనలు కూడా
పినరయి విజయన్ ప్రభుత్వమే చేయించిందని ఆయన ఆరోపించారు. ‘‘ఆ నిరసనల్లో నల్లజెండాలు
పట్టుకున్నవారు అసలు విద్యార్ధులు అవునో కాదో కూడా తెలీదు. మీరు చూస్తే, వాళ్ళు
విద్యార్ధుల వయసులో లేరని అర్ధమవుతుంది. వాళ్ళని అధికార పక్షమే తీసుకొచ్చింది.
ఇదంతా కన్నూరు యూనివర్సిటీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతోంది.
వాళ్ళకి యూనివర్సిటీల మీద పట్టు లేకుండా పోతోంది. వాళ్ళు కోరుకున్నవారిని
నియమించుకోలేకపోతున్నారు. అందుకే ఇలా చేస్తున్నారు’’ అని గవర్నర్ చెప్పుకొచ్చారు.
గత కొన్నాళ్ళుగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు
వ్యతిరేకంగా సీపీఎం విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిరసన
ప్రదర్శనలు నిర్వహిస్తోంది. గవర్నర్ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్‌గా తనకున్న అధికారాలతో
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ నామినీలను జొప్పిస్తున్నారని
వారి విమర్శ.
దానికి గవర్నర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఎస్ఎఫ్ఐ,
పీఎఫ్ఐ కార్యకర్తలను తమ సంస్థలోకి చేర్చుకుంది. ఇక ముఖ్యమంత్రి యువతను బలిపశువులను
చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. అలాంటి ద్రోహులకు తాను భయపడబోనని
వ్యాఖ్యానించారు. ఎస్ఎఫ్ఐ నిరసనల తర్వాత కేంద్రప్రభుత్వం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్
ఖాన్‌కు జెడ్ కేటగిరీ భద్రత సమకూర్చింది.