ఛలో
దిల్లీకి పిలుపునిచ్చిన రైతులతో మరోమారు చర్చలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం
ఆహ్వానం పంపింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్ వేదికగా
ఆహ్వానం పలికారు. రైతుల డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్న
అర్జున్ ముండా, శాంతియుత వాతావరణం కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు.
రైతులు,
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఇప్పటికే నాలుగు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
దీంతో నేటి ఉదయం నుంచి రైతులు మళ్లీ దిల్లీ బాటపట్టారు. దిల్లీ సమీపంలోని రైతులతో
పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో హస్తినకు తరలివస్తున్నారు.
రైతులను
దిల్లీ సరిహద్దులోనే పోలీసులు అడ్డుకుంటున్నారు.
ముళ్ళ కంచెలు, సిమెంటు దిమ్మెలు అడ్డుగా ఉంచారు. బారికేడ్లు తొలగించేందుకు
ప్రయత్నించిన రైతులపై టియర్ గ్యాప్ ప్రయోగించారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న
తమపై పోలీసులు కర్కశంగా వ్యవహరించడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారని
పంజాబ్ డీజీపీ ఓ ప్రకటనలో తెలిపారు.
శంభు
సరిహద్దు వద్ద 1200 ట్రాక్టర్లు, 14 వేల మంది రైతులు మోహరించినట్లు కేంద్ర హోం శాఖ
నివేదించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.
ఆదివారం
రాత్రి జరిగిన నాలుగో దఫా చర్చల్లో కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాలు
తిరస్కరించాయి. ఐదేళ్ళ కాంట్రాక్టుతో పప్పు ధాన్యాలు, పత్తి పంట కొనుగోలు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనకు
తాము ఒప్పుకోవడం లేదని రైతులు చెప్పారు. కనీస మధ్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని
డిమాండ్ చేస్తున్నారు.