సుప్రీంకోర్టు
జోక్యంతో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వివాదం కొలిక్కి
వచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఊరట దక్కింది. ఆప్–కాంగ్రెస్
కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ
అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్
మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం కొట్టివేసింది.
రిటర్నింగ్
అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు
కోర్టు గుర్తించింది.. రాజ్యాంగంలోని
ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక
అధికారాల ప్రకారం, చండీగఢ్ మేయర్గా ఆప్–కాంగ్రెస్
అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో
అవకతవకలు జరిగాయంటూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును
ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని
త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి కీలక తీర్పు వెల్లడించింది. రిటర్నింగ్ ఆఫీసర్
చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా
పరిశీలించిన ధర్మాసనం అవి ఎక్కడ
పాడైపోయాయి? ఎందుకు
చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని నిలదీసింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు
నిర్ధారించింది.
ఆప్ అభ్యర్థికి అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే
చెల్లనివిగా గుర్తించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన
బాధ్యత కోర్టుపై ఉందని తెలిపింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద విచారణకు ఆదేశించింది.
చండీగఢ్ మేయర్ ఎన్నిక జనవరి 30న జరిగింది. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉండగా బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో
రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8
ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా
ప్రకటించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఆప్ కోర్టును ఆశ్రయించింది.