International Mother Tongue Day
తెలుఁగదేలనన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులుగొలువ నెరుఁగ వే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స
అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన భాష మన తెలుగు
భాష. మన మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాష మీద ప్రేమాభిమానాలు ఉండడం సహజం. అందువల్ల తెలుగును
గొప్పగా కీర్తించడం మనకు ఆనందం కలిగిస్తుంది.
ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరి మాతృభాషలో వారికి
విద్యాబోధన చేస్తే సులువుగా అర్ధమవుతుంది. భాష కేవలం భావాల వినిమయానికి మాత్రమే
కాదు, ఆ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, రీతి రివాజులను ప్రకటించే
మాధ్యమం. అందువల్లనే తెల్లవాడు, తాను ఆక్రమించుకున్న దేశాల్లో తన ప్రాబల్యాన్ని
నిలుపుకోడానికి స్థానిక భాషలను చంపేసి ఇంగ్లీషు భాషే గొప్పది అన్న భ్రమ కల్పించాడు.
ఆ ఉచ్చులో పడిన మన భారతీయులం, ప్రత్యేకించి తెలుగువాళ్ళం
ఇప్పటికీ అదే అపోహలో ఉన్నాం. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషలో బోధనను తక్కువ చేసి చూపుతున్నాయి.
తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచీ ఆంగ్ల
మాధ్యమంలోనే బోధనను తప్పనిసరి చేసేసాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్
జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఆంగ్లమాధ్యమంలో చదువుకుంటేనే పిల్లలు ప్రపంచవ్యాప్త
పోటీలో మన పిల్లలు రాణించగలుగుతారంటూ ప్రచారం చేస్తోంది. దానికి ఎలాంటి
శాస్త్రీయమైన ఆధారమూ లేకపోయినప్పటికీ ఇంగ్లీషు భాషనే ప్రోత్సహిస్తోంది. దాని
దుష్ఫలితం ఏంటంటే… ఇప్పటి పిల్లలకు అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు… రెండూ రావడం
లేదు. విదేశీ భాష ఆధారంగా నేర్చుకునే విజ్ఞానశాస్త్రాల్లో పట్టు ఉండడం లేదు. వివిధ
సాంకేతిక విద్యలు అభ్యసిస్తున్న విద్యార్ధుల నాణ్యత కొన్నేళ్ళుగా క్రమంగా పడిపోతుండడం
అందరికీ తెలిసిన విషయమే.
అసలు అంతర్జాతీయ మాతృభాషా దినం ఎందుకు
జరుపుకుంటున్నాం? ఎవరు దీన్ని ప్రారంభించారు? దీని ప్రాధాన్యత ఏంటి? ఆసక్తికరమైన అంశం
ఏంటంటే ఈ దినానికి మూలాలు మన భారత ఉపఖండంలోనే ఉన్నాయి.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు
మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయి వేరే దేశంగా ఏర్పడింది. పాకిస్తాన్లో రెండు
భాగాలుండేవి. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. భారతదేశంలోని బెంగాల్
రాష్ట్రంలో ముస్లిములు అత్యధికంగా ఉండే తూర్పు భాగాన్ని పాకిస్తాన్‌గా ఇచ్చేసాం.
అయితే తూర్పు పాకిస్తాన్‌లోని ముస్లిములు ఉర్దూ మాట్లాడేవారు, పశ్చిమ పాకిస్తాన్‌లోని
ముస్లిములు స్థానిక భాష అయిన బెంగాలీ మాట్లాడేవారు. తూర్పు పాకిస్తాన్ తమ
ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి పశ్చిమ పాకిస్తాన్‌పై ఉర్దూ భాషను రుద్దింది. 1948లో
పాకిస్తాన్ అంతటికీ ఉర్దూను అధికారిక భాషగా ప్రకటించింది. దాంతో పశ్చిమ పాకిస్తాన్లో అలజడి రేగింది. వారు
బెంగాలీని కూడా తమ అధికారిక భాషగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. దానికి పశ్చిమ
పాకిస్తాన్ ఒఫ్పుకోలేదు. దాంతో తూర్పు పాకిస్తాన్లో ఉద్యమం మొదలైంది. దాన్ని పశ్చిమ
పాకిస్తాన్ బలవంతంగా అణచివేయాలని చూసింది. ఢాకాలో నిషేధాజ్ఞలు విధించింది. వాటిని
ఉల్లంఘిస్తూ 1952 ఫిబ్రవరి 21న తూర్పు పాకిస్తాన్ ప్రాంత ప్రజలు భారీ ర్యాలీ
నిర్వహించారు. ఆ ర్యాలీని అణచివేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ దాడుల్లో
పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. తమ మాతృభాషను రక్షించుకోవడం
కోసం ప్రాణత్యాగాలు సైతం చేసారు. భాష కోసం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం చరిత్రలో
ఒక కీలక ఘట్టం.
ఆ ఉద్యమం తీవ్రతకు తూర్పు పాకిస్తాన్ లొంగివచ్చింది.
1956 పాకిస్తాన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉర్దూతో పాటు బెంగాలీకి
కూడా జాతీయ భాష హోదా ఇచ్చింది. 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరిట మరో
దేశంగా ఏర్పడింది. తమ దేశానికి బెంగాలీనే అధికార భాషగా ప్రకటించింది. ఆ పరిణామాల
నేపథ్యంలో ‘ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ – యునెస్కో’ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా 1999
నవంబర్ 17న ప్రకటించింది. ప్రపంచంలోని చిన్నా పెద్దా అన్ని భాషలనూ రక్షించుకోవాలనీ,
భాషా సాంస్కృతిక వైవిధ్యాన్నికాపాడుకోవడం ద్వారానే జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం
సాధ్యమవుతుందనీ యునెస్కో చెప్పింది.
వృత్తి ఉద్యోగాల కోసం ఆంగ్లం నేర్చుకోవడం
తప్పనిసరి అయిన పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. బ్రిటిష్ వలస పాలన దేశాల్లో
మాత్రమే ఇంగ్లీష్ ప్రాబల్యం ఉంది. మిగతా దేశాల్లో తమ స్థానిక భాషలనే
ఉపయోగిస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, చైనా, రష్యా, వంటి వందలాది దేశాల్లో
ఇంగ్లీషు మాధ్యమంలో బోధనలు జరగడం లేదు. అందువల్ల ఇంగ్లీషు భాష నేర్చుకోవడంలో తప్పు
లేదు. కానీ ఇంగ్లీషునే బోధనా మాధ్యమంగా చేసి ఆ భాషలో మాత్రమే చదువుకోవాలి అని
చెప్పడం తప్పు. దానివల్ల పిల్లలు రెంటికీ చెడిన రేవళ్ళుగా మారుతున్నారు తప్ప ప్రయోజనం
ఉండడం లేదు. మనవైన దేశీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలంటే బోధనా భాషగా,
మాధ్యమ భాషగా మాతృభాషే ఉండాలి.
అంతర్జాతీయ పరిశోధనలు సైతం మాతృభాషలో చదువుకున్న
వారే తమతమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని చాటుతున్నాయి. జపాన్, ఐర్లండ్,
పోలండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే
జరుగుతోంది. మాతృభాషలో పిల్లలు మరింత మెరుగ్గా త్వరగా అవగాహన చేసుకుని నేర్చుకోగలుగుతారు.
బాల్యంలో మాతృభాషలో చదువుకున్నవారు పెద్దయాక విదేశీ భాషలను సులువుగా నేర్చుకోగలుగుతారు.
వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి సొంత మాటల్లో ప్రకటించడం
అలవాటవుతుంది. తెలివితేటలు పదునెక్కి, వారు మరింత రాణించగలుగుతారు. అందుకే నూతన జాతీయ
విద్యావిధానం 2020, మనదేశంలో కనీసం ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని
స్పష్టం చేసింది.
జగన్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ప్రభుత్వ
పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు శ్రీకారం
చుట్టింది. 2020-21 విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయి వరకు పూర్తి ఆంగ్ల
మాధ్యమంలో విద్యాబోధన చేసి ఏడాదికి ఒక తరగతి చొప్పున ఆంగ్ల మాధ్యమాన్ని పెంచుకుంటూ
పోవాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. శాస్ర్తియ అధ్యయనం లేకుండా తెలుగు
మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి, తెలుగు మాధ్యమంలో
విద్యాభ్యాసం చేస్తున్న 26 లక్షల మంది విద్యార్థులపై
ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దే ఈ నిర్ణయాన్ని అనేకమంది వ్యతిరేకిస్తున్నారు.
ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన చేసి 6వ తరగతి తరువాత ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టవచ్చు.
అప్పుడు విద్యార్ధులు తమకు కావలసిన మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం ఉండాలి.