తెలంగాణలో జరిగే చారిత్రాత్మక వనజాతరకు
భక్తులు తండోపతండాలుగా తరలి వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది
రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 24
వరకు జాతర జరగనుంది. సమ్మక్క, సారలమ్మలు అరణ్యం నుంచి
జనారణ్యంలోకి వచ్చి పూజలు అందుకుంటారు.
జాతర వారం ముందే ప్రారంభమైంది. మండమెలిగే
క్రతువుతో జాతరను ఆదివాసీ పూజారులు ప్రారంభించారు.మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ
సంప్రదాయలతో గద్దెలపైకి తీసుకొచ్చి పూజలు చేశారు. కన్నెపల్లి నుంచి సంపెంగ వాగు
ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకువచ్చారు.
నేటి సాయంత్రం నాలుగు గంటలకు సమ్మక్క
కూతురైన సారలమ్మ కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును
గద్దెపైకి ఊరేగింపుగా తీసుకొస్తారు.
గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి
గద్దెపై కొలువుదీరుతుంది. శుక్రవారం నుంచి ఇద్దరు అమ్మవార్లు భక్తులను
కటాక్షిస్తారు. శనివారం నాడు అమ్మవార్లు
వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.
ఈ సారి
జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా
ఏర్పాట్లు చేశారు.
ఈ జాతర కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రూ. 3 కోట్లు విడుదల
చేసింది. 2014 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతరను రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నారు.