చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంలో పడింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దానిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రీ కౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం 8 బ్యాలెట్లను పరిశీలించింది. అవి చెల్లుబాటు కానివి కావడంతో తిరిగి మరలా ఓట్లు లెక్కించాలని ఆదేశించింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్‌లో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొన్ని బ్యాలెట్ పేపర్లపై రాతలు ఉండటాన్ని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. బ్యాలెట్లపై కొట్టివేత గుర్తులపై కూడా రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. బ్యాలెట్లపై రాతలు ఉండటంతో వాటిపై ఇంటు మార్కు గుర్తులు పెట్టినట్లు అనిల్ మసీహ్ ధర్మాసనం ముందు తెలిపారు. వాటిని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించి, తీర్పు వెలువరించింది.