కాంగ్రెస్,
సమాజ్ వాదీ పార్టీల మైత్రీ బంధం, త్వరలో తెగిపోయేలా ఉంది. ఇరు పార్టీల మద్య సీట్ల
సర్దుబాటు ప్రతిష్టంభన తొలగకపోవడంతో పొత్తులు తెగతెంపులు అయ్యే సూచనలే ఎక్కువగా
కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్
సభ స్థానాలు ఉండగా, అందులో కేవలం 17 స్థానాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు
కేటాయించేందుకు ఎస్పీ సుముఖత చూపుతోంది.
మొరాదాబాద్ డివిజన్ లోని మూడు సీట్లలో ఒక్కటి
కూడా కాంగ్రెస్ కు ఇచ్చేది లేదని ఎస్మీ భీష్మించుకు కూర్చుంది.
సీట్ల
సర్దుబాటుపై స్పష్టత వచ్చిన తర్వాతే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో
అఖిలేశ్ పాల్గొంటారని ఎస్పీ శ్రేణులు స్పష్టం చేశాయి. సీట్ల లెక్క తేలకుండా
చెట్టాపట్టాలేసుకు తిరగడం కుదరదని కాంగ్రెస్ కు తేల్చి చెప్పినట్లు ప్రచారం
జరుగుతోంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర,
ఉత్తర ప్రదేశ్ కు చేరుకుంది.
ఇరుపార్టీల
ముఖ్యల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో మొరాబాద్ విషయంలో పేచీ ఏర్పడింది. మిగతా
చోట్ల ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం
ఏర్పడినప్పటికీ, మొరాదాబాద్ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఎస్పీ-కాంగ్రెస్ బంధం ప్రశ్నార్థకంగా మారింది.
బిజ్నోర్, మొరాదాబాద్ సీట్లు మాకే కావాలంటూ ఇరు పార్టీలు పట్టుబడుతున్నాయి.
కాంగ్రెస్
కు కేవలం 11 సీట్లు మాత్రమే ఇస్తామన్న ఎస్పీ నేత అఖిలేశ్, ప్రస్తుతం ఓ మెట్టుదిగి,
అత్యంత పురాతన రాజకీయ పార్టీగా పేరున్న కాంగ్రెస్ కు 17 సీట్లు ఇచ్చేందుకు
సిద్ధమయ్యారు. కానీ మొరాబాద్ విషయంలో మాత్రం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
హై
ప్రొఫైల్ నియోజకవర్గాలుగా పేరున్న అమేథీ, రాయ్‌బరేలీ, వారణాసి, ప్రయాగ్ రాజ్,
డియోరియో, బన్సాగావ్, మహరాజ్ గంజ్ , బారాబంకి, కాన్పూర్, ఝాన్సీ, మథుర, ఫతేపూర్
సిక్రీ,, ఘజియాబాద్, బులందర్ షహర్, హత్రాస్, సహారన్ పూర్ సీట్ల విషయంలో ఇరుపక్షాలు ఏకతాటిపైకి వచ్చినప్పటికీ బల్దియా, మొరాదాబాద్, బిజ్నోర్ సీట్లు మాత్రం పొత్తు బంధానికే ఎసరు తెచ్చాయి.
జనవరిలో
16 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన ఎస్పీ, మరో 11 స్థానాలకు అభ్యర్థులను
ఖరారు చేస్తూ సోమవారం రెండో దఫా జాబితా
ప్రకటించింది.
ఉత్తర
ప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 62 చోట్ల విజయం సాధించింది.
ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకున్నాయి. సింగిల్ గా పోటీలోకి
దిగిన కాంగ్రెస్, కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.