Political motives behind farmers’ protest
ఊహించినదే జరిగింది. పంజాబ్ రైతులు-కేంద్రప్రభుత్వం
మధ్య చర్చలు విఫలమయ్యాయి. కేంద్రం చేసిన ప్రతిపాదనలకు ఒప్పుకోని రైతులు బుధవారం
నుంచి మళ్ళీ ఢిల్లీ చలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అసలింతకీ ఈసారి రైతుల ఆందోళనలో
వారి డిమాండ్లేమిటి? అవి ఎంతవరకూ ఆచరణసాధ్యం?
నిజానికి రైతుల కంటె, రైతుల ముసుగులో ఉన్న రాజకీయ
నాయకులే ఈ ఆందోళనను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ముందునుంచే ఉన్నాయి. ఒకపక్క
వ్యవసాయం నష్టాల్లో ఉందంటూ, చేస్తున్న ఖర్చుకూ వస్తున్న ఆదాయానికీ పొంతనే లేదంటూ
ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఆరు నెలల పాటు దేశ రాజధానిని దిగ్బంధం చేయడానికి
తగిన సన్నాహాలతో వచ్చారు. ట్రాక్టర్ల మీదనే టెంట్లు, ఆరునెలలకు సరిపడా ఇంధనం, ఆహార
పదార్ధాలూ మోసుకుని బయల్దేరారు. మరి వారికి
అన్ని నిధులు ఎక్కడినుంచి వచ్చాయి? సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు,
సరైన డిమాండ్లు ఏమీ లేకుండానే ఆందోళనకు సిద్ధమయ్యారంటే వారి ఉద్దేశమేంటి? వారికి ఏ
రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి? వంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి.
గతంలో పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టినప్పుడు,
అప్పట్లో కేంద్రప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్నది
ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్‌లో తప్పొప్పుల సంగతి పక్కన పెడితే, అసలంటూ ఏదో ఒక
అజెండా ఉంది. కానీ ఇఫ్పుడు మొదలుపెట్టిన రైతుల ఆందోళనకు నిర్దిష్టమైన రైతు అజెండా
ఏమీ లేదు. ఉన్నది ఒకటే, రాజకీయ అజెండా. నరేంద్ర మోదీ పదవీభ్రష్టుడు కావాలి, బీజేపీ
మళ్ళీ గద్దె ఎక్కకూడదు. అంతే. అందుకే, తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ రైతుల
సమస్యలపై స్పందించని పార్టీలన్నీ ఈ ఆందోళనకు మద్దతునిస్తున్నాయి. అంతేకాదు, అసలీ
ఉద్యమానికి పెట్టుబడి పెడుతున్నది కూడా వారే అన్న వాదనలున్నాయి.
రాజకీయ కోణం పక్కన పెడితే, ఈసారి రైతుల ఆందోళనలో
ప్రధానమైన డిమాండ్లేమిటి? అవి ఆచరణ సాధ్యమేనా? ఒకసారి చూద్దాం. ముందుగా, రైతుల
ప్రధాన డిమాండ్లు ఏంటంటే…
కనీస మద్దతు ధరకు రక్షణ కల్పిస్తూ చట్టం చేయాలి. ఉత్పాదక
వ్యయం కంటె కనీస మద్దతు ధర కనీసం 50శాతం ఎక్కువ ఉండాలి.
2020-21 రైతుల ఆందోళన సమయంలో పెట్టిన కేసులన్నింటినీ
బేషరతుగా ఉపసంహరించుకోవాలి.
రైతులు, రైతు కూలీలకు పింఛన్లు చెల్లించాలి, రైతురుణాలన్నీ
మాఫీ చేయాలి.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి.
భవిష్యత్తులో విదేశాలతో ఏ ఒప్పందాలూ చేసుకోకూడదు.
2020 నాటి విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి.
భూసేకరణ చట్టం 2013ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజులు
పని కల్పించాలి, రోజుకు రూ.700 చెల్లించాలి.
ఇక ఈ డిమాండ్లు ఎంతవరకూ ఆచరణ సాధ్యం? బీజేపీ
ప్రభుత్వం బదులు మరే ఇతర పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ డిమాండ్లను
నెరవేర్చగలవా? అన్నది పరిశీలిద్దాం.
కనీస మద్దతు ధరకు రక్షణ కల్పిస్తూ చట్టం చేయాలి,
ఆ ధరను కనీసం 50శాతం పెంచాలి.
ఈ డిమాండ్‌కు పరిష్కారంగా కేంద్రం ఐదేళ్ళ పాటు పప్పుధాన్యాలు,
మొక్కజొన్న, పత్తి వంటి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని
ప్రతిపాదించింది.
నిజానికి ఈ డిమాండ్‌ను యథాతథంగా ఆచరణలోకి
తీసుకొస్తే మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ధరలు కూడా 50శాతం పెరుగుతాయి. కరోనా,
ఉక్రెయిన్ యుద్ధం అనంతర కాలంలో వ్యవసాయోత్పత్తుల ధరలు ఇప్పటికే పెరిగాయి, అవి ఇంకా
పెరిగితే సామాన్య ప్రజల మీద భారం విపరీతంగా పెరుగుతుంది. అలాగే, ప్రజాపంపిణీ
వ్యవస్థ కోసం చేస్తున్న ఖర్చు కూడా సగానికి సగం పెరుగుతుంది. నిజానికి, గత
అక్టోబర్‌లోనే కేంద్రం ఆరు రకాల రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచింది.
గత ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి,
అప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి వంటి డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది.
వీటికి పెద్దగా ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు.
రైతులు, రైతుకూలీలకు పింఛన్లు చెల్లించాలి,
రైతురుణాలు మాఫీ చేయాలి అన్న డిమాండ్లు ఆచరణసాధ్యం కావు. ఎంతకాలం పాటు, ఎందరు
రైతులకు ఎంతమొత్తం పింఛను చెల్లించాలి… అది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఎంత భారం
మోపుతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పింఛన్ల వర్తింపు తొలగించడం
మీద కసరత్తులు, వాటికి వ్యతిరేకంగా ఆందోళనలూ జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా వేతనాల
వంటివి లేని వ్యవసాయరంగంలోని వారికి పింఛన్లు చెల్లించడం దేశ ఖజానాపై అమితమైన భారం
మోపుతుంది. రైతురుణాల మాఫీ కూడా అంతే.
ప్రపంచ వాణిజ్య సంస్థతో గతంలో ఎప్పుడో చేసుకున్న ఒప్పందాన్ని
ఇప్పుడు రద్దు చేసుకోవాలట. భవిష్యత్తులో ఏ ఇతర దేశంతోనూ ఎలాంటి ఒప్పందమూ
చేసుకోకూడదట. అసలు ఈ డిమాండ్‌లో ఉన్న తర్కమేమిటి? ఇదే జరిగితే ఎగుమతులు, దిగుమతులు
ఆగిపోతాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది.
విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్
వల్ల… విద్యుత్ వినియోగంపై అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే రకరకాల సమస్యలతో
దిగజారిపోతున్న విద్యుత్ రంగం మరింత నష్టపోతుంది. రాష్ట్రప్రభుత్వాలు ఉచిత
విద్యుత్తు, సబ్సిడీ విద్యుత్తు హామీలు ఇచ్చేస్తే, విద్యుత్తు జెన్కోలు, డిస్కంల నడ్డి
విరిగిపోతుంది. చివరికి ఆ నష్టాలన్నీ కేంద్రం మెడకు చుట్టుకుంటాయి.
భూసేకరణ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలి అన్న డిమాండ్
ఆచరణలోకి వస్తే, పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగిపోతాయి. రహదారులు, రైల్వేలు,
ప్రాజెక్టుల వంటి భారీ నిర్మాణాలకు ఈ చట్టం నుంచి కొన్ని మినహాయింపులు గతంలో ఇచ్చారు.
ఇప్పుడు వాటిని తొలగించాల్సి వస్తే దేశాభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతాయి.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి,
రోజువారీ చెల్లింపులను రూ.700కు పెంచాలి అన్న డిమాండ్ ఖజానా మీద భారీ భారం
మోపుతుంది. ఈ పథకం పరిధిని వంద రోజుల నుంచి 2వందల రోజులకు పెంచడం, ఇప్పుడు సుమారు
రూ.300 లోపు ఉన్న కూలీని రెట్టింపు కంటె ఎక్కువగా రూ.700 చేయడం అంటే దాదాపు నాలుగు
రెట్ల అధిక భారం మోపడమే. ఇక చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో జరుగుతున్న
కుంభకోణాలు అన్నిఇన్నీ కావు. పైగా, ఉపాధి హామీ పథకం లక్ష్యం వ్యవసాయ పనులు ఉండని
కాలంలో రైతుకూలీలకు తాత్కాలిక ఉపాధి కల్పించడం మాత్రమే. దాన్నే ప్రధాన ఉపాధిగా
మార్చేస్తే వ్యవసాయ పనులకు కూలీలు దొరకని పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు నష్టం
రైతులకే. ఇంక కూలీ రేట్లు దాదాపు మూడు రెట్లు పెరిగిపోతాయి. ఆ భారం ఎవరి మీద
పడుతుంది?
ఒక అంచనా ప్రకారం కనీస మద్దతు ధర 50శాతం పెంచడం…
రైతులు, రైతుకూలీలకు పింఛన్లు చెల్లించడం… గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిని
నాలుగురెట్లు పెంచడం చేస్తే… కేంద్రప్రభుత్వం మీద ఏడాదికి కనీసం రూ.35లక్షల కోట్ల
అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం మన దేశం మొత్తం బడ్జెట్టే సుమారు రూ.45 లక్షల
కోట్లు. అందులో రూ35లక్షల కోట్లు ఈ మూడు పథకాలకే కేటాయిస్తే మిగతా దేశం ఏమైపోవాలి?
ప్రభుత్వం ఎలా నడవాలి? దేశాన్ని ఎలా నడిపించాలి?
నరేంద్రమోదీ కాదు, ఒకవేళ రాహుల్ గాంధీయో లేక అరవింద్
కేజ్రీవాలో ప్రధానమంత్రి అయినా, వారు కూడా ఈ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వాన్ని
నడపలేరు. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ డిమాండ్లను అంగీకరించగలిగే పరిస్థితి
ఉండదు. అయినా, రైతుల ముసుగులో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఈ నాటకం ఎందుకు
ఆడుతున్నాయని ఆలోచిస్తే…. రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి కాదనీ, ఆ డిమాండ్లు
ఒప్పుకోలేదన్న సాకుతో దేశ రాజధానిని దిగ్బంధించి, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్
చేసి, పరిపాలనను స్తంభింపజేసి, ఈ ప్రభుత్వాన్ని విఫల ప్రభుత్వం కింద చిత్రీకరించాలి.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలి అన్న లక్ష్యంతోనే
ఆచరణసాధ్యం కాని ఇలాంటి డిమాండ్లతో రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నారు అన్న విషయం
అర్ధమవుతుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు