రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం తిరుపతి సమీపంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐఐటీ, ఐసర్ భవనాలను సిద్దం చేసింది. 2017లో ఐఐటీ, ఐసర్ పనులు ప్రారంభం కాగా, నేడు తుదిరూపుదిద్దుకున్నాయి. తిరుపతి సమీపంలోని శ్రీనివాసపురంలో 255 ఎకరాల విస్తీర్ణంలో, రూ.2117 కోట్ల వ్యయంతో ఐసర్ భవనాలు నిర్మించారు. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటి వరకు తాత్కాలికంగా ఐసర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి కొత్త భవనంలో 1500 మంది విద్యార్ధులు చదువు కొనసాగించనున్నారు.
ఐఐటిటి ప్రత్యేకతలు
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ఐఐటీ. ఐఐటీలో సీటు సాధించాలని లక్షలాది విద్యార్థులు కలలుకంటూ ఉంటారు. ఏపీలోనే ఐఐటీ సంస్థలో చదువుకునే అవకాశం తెలుగు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి సమీపంలో ఏర్పేడు నందికొండలకు ఆనుకుని 578 ఎకరాల్లో ఐఐటీ భవనాలు సిద్దం చేశారు. సాంకేతిక విద్యను అందించడంలో ఐఐటీలకు తిరుగేలేదు. ఏర్పేడు ఐఐటీలో ఈ ఏడాది నుంచి 1550 మంది విద్యార్థులు చదువుకోనున్నారు.
విశాఖ సిగలో ఐఐఎం మణిహారం
విశాఖ నగరానికి సమీపంలో మరో విద్యాసంస్థ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐఐఎంను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఐఐఎం నిర్మించారు. 2016 నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలోని గంభీరలో 436 ఎకరాల్లో ఐఐఎం క్యాంపస్ పర్యావరణహిత భవనాలతో సిద్దమైంది.
ప్రత్యేకతలెన్నో…
ఐఐఎం క్యాంపస్ అంటే కేవలం భవనాలే కాదు. అక్కడ పర్యావరణహితంగా నిర్మించిన ఎకో భవనాలు నిర్మాణరంగంలో మైలురాయిగా నిలవనున్నాయి. రూ.445 కోట్ల వ్యయంతో ఐఐఎం పర్యావరణహిత క్యాంపస్‌ను సౌర విద్యుత్ సదుపాయాలతో సిద్దం చేశారు. ఫ్యాకల్టీ భవన్, అడ్మిన్ బ్లాక్, తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలను తీర్చి దిద్దారు. క్యాంపస్‌లో 7200 జాతుల ఫల, పుష్ప మొక్కలను నాటారు.