విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఐఐటీ, ఐసర్ విద్యాసంస్థలను ప్రధాని మోదీ (pm modi) విర్చువల్‌గా నేడు జాతికి అంకితం చేయనున్నారు. 2017లో ఈ రెండు సంస్థలకు శంకుస్థాపన చేశారు. నేడు పూర్తి స్థాయిలో సిద్దమయ్యాయి. ఐఐటీ, ఐసర్ భవనాలను ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం చేయనుండగా, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్.సత్యనారాయణ పాల్గోనున్నారు.
విశాఖలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఎం సిద్దమైంది. 436 ఎకరాల్లో రూ.445 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం, గంభీరం వద్ద నిర్మించిన ఐఐఎం భవనాలను ప్రధాని మోదీ ఇవాళ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. ఐఐఎం భవనాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆచార్యుల భవనాలు, పరిపాలన భవనంతోపాటు, విద్యార్థుల వసతి గృహాలను పూర్తి చేశారు. అత్యాధునిక హంగులతో విశాఖ ఐఐఎం క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.