Guntur Doctors screen Ayodhya
Pran Pratishtha, While Performing Surgery
మెదడులో కణితితో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు
కీలక ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
సన్నివేశాలను ల్యాప్ టాప్ లో చూపుతూ, రోగి మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స
నిర్వహించారు. ఆపరేషన్ చేస్తుండగా బాలరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి రోగి
నమస్కరించాడు.
గుంటూరు అరండల్పేటలోని శ్రీసాయి ఆసుపత్రి
వైద్యులు, ఈ అరుదైన, ఖరీదైన శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించడాన్ని పలువురు
అభినందిస్తున్నారు.
గుంటూరు జిల్లా గొడవర్రు గ్రామానికి చెందిన దానబోయిన
మణికంఠ (29) కొంతకాలంగా ఫిట్స్
సమస్యతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా పరిష్కారం దొరకకపోవడంతో
చివరికి శ్రీసాయి ఆసుపత్రి వైద్యులకు తన సమస్య మొరపెట్టుకున్నాడు.
మెదడులో 7 సెంటీమీటర్ల పరిమాణంలో కణతిని ఉందని
దానిని తొలగించాలని చెప్పారు. రోగి ఆరోగ్య పరిస్థితి, అంగీకారం మేరకు ఈ నెల 11న శస్త్రచికిత్స
విజయవంతంగా నిర్వహించారు.
ల్యాప్టాప్ లో మణికంఠకు అయోధ్య బాలరాముడి
ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ కణతి తొలగించారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి బాలరాముడికి
రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. అరుదైన ఆపరేషన్ కావడంతో నావిగేషన్ వంటి
అత్యాధునిక విధానాలను అనుసరించినట్లు న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి
తెలిపారు.