Khalistani terrorists desecrate Tricolour in Vancouver
ఖలిస్తానీ ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. భారత
జాతీయ పతాకాలను తగులబెట్టారు. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కెనడాలోని
వాంకూవర్‌లో భారత దౌత్యకార్యాలయం ఎదుట ఫిబ్రవరి 18న ఈ దారుణం జరిగింది.
కెనడా కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్
వేర్పాటువాదులు ఆదివారం నాడు మరింత బరితెగించేసారు. భారత ప్రభుత్వానికి
వ్యతిరేకంగా విద్వేషపూరిత ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రెండు త్రివర్ణ పతాకాలను
తగులబెట్టారు. మరో భారత జెండాను చించిపోగులు పెట్టారు. భారతదేశానికి,
హిందూధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. భారత దౌత్యకార్యాలయం ముందు లౌడ్
స్పీకర్లు పెట్టి పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో ‘‘షేమ్ ఆన్ ఇండియా’’ అంటూ ఖలిస్తానీ
నినాదాలు చేసారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో హత్య చేసి
ఎనిమిది నెలలు అయిన సందర్భంగా వారు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో
హిందువులను గోమూత్రం తాగేవాళ్ళంటూ అవహేళన చేసారు.
ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నేతృత్వంలో కెనడాలో భారత
వ్యతిరేక ధోరణులు ప్రబలుతున్నాయి. ఖలిస్తానీ అనుకూల శక్తులకు కెనడా
ఆశ్రయమిస్తోంది. ఆ నేపథ్యంలో కెనడా అధికారులు తమ దేశపు న్యాయ వ్యవస్థ గురించి
భారతీయ అధికారులకు వర్క్‌షాపులు నిర్వహించి వివరిస్తున్నారు. ఉగ్రవాదం, అతివాదం
గురించి రెండుదేశాల అవగాహనల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి ఆ వర్క్‌షాపులు
నిర్వహిస్తున్నట్లు కెనడా అధికారులు చెబుతున్నారు. కెనడాలోని అత్యున్నత స్థాయి
అధికారి వెల్డన్ ఎప్ ఈ వర్క్‌షాప్ చేపట్టారు.
కెనడా చట్టాల గురించి భారతీయ అధికారులకు తెలియజేయడం;
అతివాదం, ఉగ్రవాదం గురించి ఇరుదేశాల అభిప్రాయాలు, నిర్వచనాలు,
చట్టపరమైన చర్యల్లో ఉండే తేడాలను వివరించడమే ఈ వర్క్‌షాప్‌ల ప్రధాన ఉద్దేశం.
‘‘అతివాదాన్ని, ఆ మాటకొస్తే ఉగ్రవాదాన్ని భారతదేశం నిర్వచించే తీరు మా
న్యాయవ్యవస్థతో అన్నిసార్లూ ఒకేలా ఉండదు’’ అని వెల్డన్ ఎప్ స్పష్టం చేసారు.
వాంకూవర్‌లోని భారత దౌత్యకార్యాలయం వెలుపల
చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు హిందువులను
దూషించారు. ‘‘మా టైం వస్తోంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి. గోమూత్రం తాగేవాళ్ళు,
ఆవుపేడను పూజించేవాళ్ళు తమతమ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మమ్మల్ని ఏమీ చేయలేరు.
భవిష్యత్తు మాదే’’ అంటూ నినాదాలు చేసారు. భారత దౌత్యకార్యాలయాన్ని కూల్చేసి, దాని
స్థానంలో ఖలిస్తాన్ దౌత్యకార్యాలయాన్ని నిర్మిస్తామంటూ బెదిరించారు.
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదుల బెదిరింపులు, రెచ్చగొట్టే
చర్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఒక కెనడియన్ జర్నలిస్టు తీసిన వీడియోలో
ఒక ఖలిస్తానీ ఉగ్రవాది భారతదేశపు జెండాను తగలబెట్టాడు. భారత ప్రధాని నరేంద్రమోదీని
హిందూ ఉగ్రవాదిగా చూపించే ప్లకార్డులు ప్రదర్శించాడు. హిందువులను అవమానిస్తూ
దూషిస్తూ వ్యాఖ్యలు చేసాడు.
జూన్ 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా
నిజ్జర్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, నిజ్జర్ హత్య
వెనుక భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి చేసిన నిరాధార వ్యాఖ్యలు, ఇరుదేశాల
సంబంధాలనూ దెబ్బతీసాయి.