Strong Nation is the concept of Guruji Golwalkar
(ఇవాళ ‘గురూజీ’ మాధవ సదాశివరావు గోళ్వల్కర్ జయంతి)
గురూజీ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
కార్యకర్తలు ప్రేమగా పిలుచుకునే వ్యక్తి రెండవ సర్‌సంఘచాలక్ మాధవ సదాశివరావు గోళ్వల్కర్‌జీ.
శక్తివంతమైన భారతదేశం అనే అద్భుతమైన భావనకు ఆయనే కారకులు. గోళ్వల్కర్‌జీ ఎల్లప్పుడూ
శక్తివంతమూ, అజేయమూ, నిర్భయమూ, సంపద్వంతమూ, స్వయంసమృద్ధమూ అయిన భారతదేశం గురించి ప్రయత్నించారు.
ఆయన జాతీయతాభావం మన గుండెల్లో ఉత్తేజం కలిగిస్తుంది.
గోళ్వల్కర్‌జీ గురించి మన ప్రధానమంత్రి
నరేంద్రమోదీ తన పుస్తకం ‘శ్రీ గురూజీ ఏక్ స్వయంసేవక్’లో ఇలా రాసారు ‘‘రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్‌ను 1925లో డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారు. కానీ ఆ
సంస్థకు సైద్ధాంతిక భూమికను ఏర్పరచింది సంఘ్ రెండో సర్‌సంఘచాలక్ మాధవరావ్
సదాశివరావ్ గోళ్వల్కర్ ‘గురూజీ’యే. రెండో ప్రపంచయుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం,
ఆజాద్ హింద్ ఫౌజ్, దేశ స్వతంత్రానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషి, దేశ విభజన,
దేశానికి స్వాతంత్ర్యం, కశ్మీర్ విలయం, గాంధీ హత్య, దేశపు మొట్టమొదటి సాధారణ
ఎన్నికలు, చైనాతో యుద్ధంలో భారత్ ఓటమి, పాకిస్తాన్‌తో 1961లోనూ, 1971లోనూ చేసిన యుద్ధాలు,
భారతదేశపు చరిత్రను మార్చేసి, కొత్త చరిత్రను రూపొందించే ఆ ఘటనలు జరిగిన మహత్తరమైన
కాలంలో శ్రీ గురూజీ సంఘంలో ప్రముఖ వ్యక్తి మాత్రమే కాదు, తన క్రియాశీలత, ఆలోచనా
ధోరణితో ఆయన అందరినీ ప్రభావితులను చేసారు’’.
అటల్ బిహారీ వాజ్‌పేయీ లేదా నరేంద్రమోదీ
నేతృత్వంలో ఏర్పడిన దాదాపు అరడజను కేంద్ర ప్రభుత్వాలు శక్తివంతమైన భారతదేశం అన్న
కాన్సెప్ట్‌ను మాత్రమే గ్రహించలేదు, దాన్ని భగవద్గీతలా పరిగణించి పారాయణ చేసాయి. అంతేకాదు,
శక్తివంతమైన భారతదేశం అన్న గురూజీ ఆలోచనను స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్, స్వతంత్రం
వచ్చాక ఏర్పడిన జవాహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహాదుర్ శాస్త్రిల ప్రభుత్వాలు కూడా స్వీకరించాయి.
నెహ్రూ తొలుత ఆర్ఎస్ఎస్ మీద నిషేధం
విధించి, గురూజీని జైల్లో బంధించారు. కానీ ఆ తర్వాత ఆయన గోళ్వల్కర్ గురూజీని అభినందిస్తూ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను 1963 గణతంత్రదినపు పెరేడ్‌లో భాగస్వామిని చేసారు
కూడా.
గురూజీ నేతృత్వంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అంటే ప్రజల్లో అభిమానం, ఆదరణ, మాన్యత పెరుగుతుండడాన్ని చూసి జవాహర్‌లాల్ నెహ్రూకు ఎంతో
బాధ కలిగింది. నెహ్రూ చేసే బ్రిటిష్-ముస్లిం అనుకూల రాజకీయాలకు గురూజీ పూర్తి వ్యతిరేకంగా
ఉండేవారు. అందుకే నెహ్రూ సంఘం అన్నా, గురూజీ అన్నా ఎప్పుడూ ప్రతికూలమైన భావాలు
కలిగి ఉండేవారు. సంఘాన్ని దేశానికి ప్రమాదకరం అనే కుత్సితమైన బుద్ధితో ఉండేవారు.
అందుకే గాంధీజీ హత్య జరిగినప్పుడు గురూజీని అరెస్ట్ చేసారు, ఆర్ఎస్ఎస్ మీద నిషేధం
విధించారు. గాంధీజీ హత్య లేదా ఆ ఆరోపణల మీద సంఘం మీద నిషేధం ఎందుకు విధించారన్నది
నేటికీ అపరిష్కృతమైన రహస్యంగానే
మిగిలిపోయింది. ఆ రహస్యం గురించిన ఒక ఆధారం గాంధీజీ హత్యకు సరిగ్గా ఒక్కరోజు ముందు
నెహ్రూ చేసిన ఒక సంభాషణలో ఉంది. ఆ సంభాషణలో నెహ్రూ, సంఘాన్ని సమూలంగా నాశనం
చేసేయాలని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ను నాశనం చేసేయాలని నెహ్రూ అన్న ఇరవైనాలుగు గంటలలోపే
గాంధీజీ హత్య జరగడం, ఆ వెంటనే సంఘం మీద
నిషేధం విధించి గురూజీని అరెస్ట్ చేయడం అదంతా ఓ చిక్కుముడే.
అభివృద్ధి చెందిన భారతదేశం అన్న నెహ్రూ ఆలోచన కంటె,
శక్తివంతమైన భారతదేశం అనే గురూజీ ఆలోచన చాలా ప్రభావశీలమైనది.
బ్రిటిషర్లు-ముస్లిములను అనుసరించే నెహ్రూ ఆలోచనల మీద, గురూజీ ప్రణాళిక పెద్ద
దెబ్బే కొట్టేలా కనిపించేది. బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్ళలో, రోడ్ల నుంచి
పార్లమెంటు వరకూ, మఠాలూ మందిరాల్లో, పరిశ్రమల్లో… అలా దేశంలో ప్రజలు
మాట్లాడుకునే అన్నిచోట్లా గురూజీ ప్రతిపాదించిన ‘శక్తివంతమైన భారతదేశం’ అన్న అంశం
మీదనే చర్చలు సాగేవి. ఆ ఆలోచనను ప్రజలు స్వాగతించసాగారు. దాంతో గురూజీ పట్ల భారతీయులకు
ఆదరణ పెరిగే వాతావరణం తయారవసాగింది. నిజానికి అప్పుడు (అప్పుడే కాదు, ఎప్పుడూ)
గురూజీకి రాజకీయాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదు. అయితే దేశంలో జరగబోయే మొదటి
లోక్‌సభ ఎన్నికల్లో తన సర్వాధిక్యానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే అడ్డుపడగలరు అని
నెహ్రూకు సుస్పష్టంగా అర్ధమయింది. వారిద్దరిలో ఏ ఒక్కరు ఏ ఒక్కమాట చెప్పినా దేశంలో
నెహ్రూకు ప్రతికూల వాతావరణం నెలకొనేది. వారిద్దరూ ఎవరంటే మొదటివారు గాంధీ,
రెండవవారు గురూజీ.
గురూజీ ప్రతిభ ఎంతటిదో నెహ్రూతో పాటు దేశ
ప్రజలందరికీ తెలుసు. కశ్మీర్ విలీనం వ్యవహారంలో
ఆయన పోషించిన పాత్రను దేశం చూసింది. ప్రముఖ రచయిత సందీప్ బోమ్‌జాయీ తన రచన
‘డిజీక్విలిబ్రియమ్ : వెన్ గోళ్వల్కర్ రెస్క్యూడ్ హరిసింగ్’లో ఇలా రాసారు
‘‘సర్దార్ పటేల్ సూచన మేరకు గురూజీ 1947 అక్టోబర్ 18న మహారాజా హరిసింగ్‌తో
సమావేశమయ్యారు. దాని తరువాతనే భారత్‌లో కశ్మీర్ విలీనం సాధ్యమయింది.’’ మహారాజా హరిసింగ్
గోళ్వల్కర్‌తో ‘‘నా రాష్ట్రం పూర్తిగా పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంది. కశ్మీర్
నుంచి బైటకు వెళ్ళే దారులన్నీ రావల్పిండి, సియాల్‌కోట్ మీదుగా వెడతాయి. మా
విమానాశ్రయం లాహోర్‌లో ఉంది. నేను భారతదేశంతో ఎలా సంబంధం కలిగి ఉండగలను?’’
అన్నారు.
మహారాజా హరిసింగ్‌కు గురూజీ ఇలా చెప్పారు. ‘‘మీరు
హిందూ రాజు. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేస్తే మీ హిందూ ప్రజలు అష్టకష్టాల్లో
చిక్కుకుపోతారు. భారతదేశంతో మీ మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందలేదన్న మాట
వాస్తవమే. కానీ కశ్మీర్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మీ సంస్థానాన్ని
భారతదేశంలో విలీనం చేయడమే మంచిది.’’
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కశ్మీర్‌లో మౌలిక
సదుపాయాల కల్పనకు చేస్తున్న కృషి, గురూజీ ఆలోచనలను సాకారం చేసే ప్రయత్నమే. అరుణ్
భట్నాగర్ రచన ‘‘ఇండియా: ష్రెడ్డింగ్ ద పాస్ట్, ఎంబ్రేసింగ్ ద ఫ్యూచర్, 1906-2017’’లో
కూడా కశ్మీర్ విలీనం విషయంలో గురూజీ పోషించిన పాత్ర గురించి ప్రస్తావించారు.
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో గురూజీ ప్రవచించిన
‘శక్తివంతమైన భారతదేశం’ అన్న సిద్ధాంతం ప్రజల మీద మంచి ప్రభావం చూపించింది. 1965
భారత్-చైనా యుద్ధం సమయంలో కూడా గురూజీతో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహాదుర్
శాస్త్రి చర్చించారు. చైనా విషయంలో ఎలాంటి నీతి అనుసరించాలి, యుద్ధానికి సంబంధించి
ఎలాంటి అడుగులు వేయాలి వంటి విషయాలను వారిద్దరూ చర్చించారు. అనంతర కాలంలో అత్యంత
ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ అయితే గురూజీ సమక్షంలో
ఎప్పుడూ కనీసం కుర్చీ మీద కూర్చునేవారు కాదు. ఎప్పుడూ కిందనే కూర్చునే వారు.
గురూజీ ‘శక్తివంతమైన భారతదేశం’ సిద్ధాంతం
ప్రభావంతో గోవా విముక్తి పోరాటం జరిగింది. భారతదేశంలో గోవా విలీనంలో రాష్ట్రీయ
స్వయంసేవక సంఘం కీలక పాత్ర పోషించడానికి కారణం గురూజీ బోధనలే. గోవా విముక్తి
పోరాటం సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దేశప్రయోజనాలకే
వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించింది. అప్పుడు గురూజీ ‘‘గోవాలో పోలీస్ చర్య చేపట్టి
గోవాను విముక్తం చేయడానికి, భారతదేశంలో విలీనం చేయడానికి ఇంతకంటె మంచి తరుణం
ఇంకెప్పుడూ రాదు. భారత ప్రభుత్వం గోవా విముక్తి పోరాటానికి అండగా నిలబడబోమని
ప్రకటించి ఆ ఉద్యమానికి ద్రోహం చేసింది. భారతీయ
పౌరుల మీద జరిపిన ఇలాంటి అమానుషమైన కాల్పులకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇంకా
విదేశీయుల చేతిలోనే ఇరుక్కుపోయి ఉన్న మన మాతృభూమిలోని ఒక భాగానికి విముక్తి కల్పించాలి,
ఆ విషయంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకూడదు’’ అని విస్పష్టంగా చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు, వామపక్షాలకూ
మౌలికమైన ఆలోచనా ధోరణిలోనే అభిప్రాయభేదాలున్నాయి. కమ్యూనిస్టులు స్వభావరీత్యా
సంఘాన్ని మొదటినుంచీ నిందిస్తూనే ఉన్నారు. ‘శక్తివంతమైన భారతదేశం’ అన్న తన సిద్ధాంతం మీద
గురూజీ ఎంత కచ్చితంగా ఉన్నారంటే ఆయన దేశహితం కోసం కమ్యూనిస్టులను కూడా కలుపుకుని
వెళ్ళాలని భావించేవారు. గురూజీ కార్ల్ మార్క్స్ గురించి ఇలా చెప్పేవారు, ‘‘భారతీయ
కమ్యూనిస్టులు కార్ల్ మార్క్స్‌కు అన్యాయం చేసారు. మార్క్స్ కేవలం భౌతికవాది
మాత్రమే కాదు. ఆయన నైతిక విలువలను కూడా విశ్వసించారు.’’ కార్ల్ మార్క్స్‌ను పూర్తి భౌతికవాదిగా భావించడం
భారతీయ కమ్యూనిస్టుల అతిపెద్ద తప్పిదం అని గురూజీ భావించేవారు.
‘శక్తివంతమైన భారతదేశం’ అన్న తన సిద్ధాంతాన్ని
క్రియాశీలం చేయగల అన్ని ఆలోచనా ధోరణుల సారాంశాన్నీ గురూజీ అన్వేషించేవారు,
వాటన్నింటినీ సమన్వయం చేసి చూపిస్తుండేవారు. ఎందుకంటే భారతదేశాన్ని శక్తివంతమైన
దేశంగా చూడాలన్నదే గురూజీ లక్ష్యం.
(వ్యాసకర్త: ప్రవీణ్ గుగ్నానీ, భారత విదేశాంగ
శాఖ సలహాదారు)