దేవాలయాల ప్రాంతాలే కాదు, దేశమంతా అత్యాధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌లో గ్రాండ్ శ్రీ కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన (pm modi lays foundation stone for kalki dham temple) చేశారు. భారతీయల విశ్వాసాలకు గ్రాండ్ కల్కి ధామ్ రాబోయే రోజుల్లో ఒక గొప్ప కేంద్రంగా విలశిల్లనుందన్నారు.
కొత్త దేవాలయాలే కాదు, దేశంలో వందలాది నూతన ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన పురాతన వస్తు సంపదను కూడా వెనక్కు తెచ్చే కార్యక్రమం మొదలైందని ప్రధాని గుర్తు చేశారు. దేశంలో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయికి పెరిగాయని, ప్రపంచంలోని ఏ మారుమూల దేశంలో ఉన్నా భారతీయులు గర్వంగా తలెత్తుకు తిరగగలుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
2024 జనవరి 22న అయోధ్యలో రామాలయానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో కొత్త శకం ప్రారంభమైందన్నారు. రాముడు వేలాది సంవత్సరాలు సుపరిపాలన చేశారని, అయోధ్యలో బాలరాముని ఆలయం ప్రారంభంతో రాబాయే వెయ్యి సంవత్సరాల్లో నూతన శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.