(ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి)
మొగలులు సహా పలు ముస్లిం నవాబుల పాలనలో నిశ్చేష్టురాలైపోయిన
భరతమాతకు విముక్తి కల్పించి స్వతంత్ర పరిపాలనకు నాంది పలికినవారిలో అగ్రగణ్యుడు
శివాజీ. మొగల్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన
ధీరుడు శివాజీ. అఖండ భారతదేశాన్ని హిందూసామ్రాజ్యం పరిపాలించినప్పుడే ప్రజలకు
శాంతిభద్రతలు లభిస్తాయని చాటిచెప్పిన వీరుడు శివాజీ.
శివాజీ 1630 ఫిబ్రవరి 19న పుణే సమీపంలోని శివనేరి
కోటలో జన్మించాడు. అతని తల్లి జిజియాబాయి, తండ్రి శహాజీ భోన్సలే. శహాజీ మొదట్లో దక్కను
ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నిజాములకు ప్రతినిధిగా ఉండేవాడు. అయితే వారి చర్యలు నచ్చక
స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆ క్రమంలో మొగలులు ఆదిల్షాతో కలిసి
శహాజీని ఓడించారు. సంధిలో భాగంగా శహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా
పొందాడు. అదే సమయంలో పుణేలోని తన జాగీరును వదులుకోనక్కరలేకుండా ఒప్పందం
చేసుకున్నాడు.
శివాజీ చిన్నతనం నుంచీ తల్లి దగ్గరే పెరిగాడు.
జిజియాబాయి అతనికి మాతృభూమి మీద ప్రేమాభిమానాలను ఉగ్గుపాలతో రంగరించి పెంచింది.
బాల్యం నుంచీ రామాయణ మహాభారతాలు, పురాణ ఇతిహాసాలు నేర్పింది. అమ్మ శిక్షణలో శివాజీ
పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉండడం నేర్చుకున్నాడు. అనతికాలంలోనే
యుద్ధతంత్రంలో నిష్ణాతుడయ్యాడు. హిందూసామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేయడం
ప్రారంభించాడు.
శివాజీ 17ఏళ్ళ వయసులో తన మొదటి యుద్ధం చేసాడు.
బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో
కొండన, రాజ్‌గఢ్ కోటలను కైవసం చేసుకున్నాడు. అప్పుడు పుణే ప్రాంతం మొత్తం శివాజీ చేతిలోకి
వచ్చింది.
శివాజీ తమ కోటలను వశం చేసుకుంటుండడంతో ఆదిల్షా
మోసంగా అతని తండ్రి శహాజీని నిర్బంధించాడు. అప్పుడు శివాజీ తన అన్న శంభాజీతో కలిసి
ఆదిల్షా సైన్యాన్ని ఓడించి తండ్రిని విడిపించుకున్నాడు. శివాజీ మెరుపుదాడులు,
గెరిల్లా యుద్ధతంత్రాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవి. దాంతో ఆదిల్షా
శివాజీని చంపేయడానికి అఫ్జల్ ఖాన్‌ను నియమించాడు.
శివాజీని రెచ్చగొట్టి కదనరంగంలోకి లాగడానికి
అఫ్జల్ ఖాన్ భవానీమాత ఆలయాలను కూలగొట్టాడు. అయినా శివాజీ చర్చలకే మొగ్గుచూపాడు.
ప్రతాప్‌గఢ్ కోట దగ్గర ఇద్దరూ సమావేశమయ్యారు. పేరుకి సమావేశమే అయినా శివాజీని
ఎలాగైనా హతమార్చాలని అఫ్జల్ ఖాన్ కత్తిని దాచుకుని వచ్చాడు. అతని కుయుక్తులు
తెలిసిన శివాజీ ఉక్కుకవచం ధరించి వెళ్ళాడు. అఫ్జల్ ఖాన్ కత్తితో శివాజీని నరకాలని
భావించినా కవచం అతన్ని రక్షించింది. తనను నిర్బంధించడానికి అఫ్జల్ ఖాన్ సైనికులు
చేసిన ప్రయత్నాలను శివాజీ వమ్ముచేసి, అఫ్జల్ ఖాన్‌ను పులిగోళ్ళ వంటి తన వేళ్ళతో
చీల్చి చెండాడాడు శివాజీ. అఫ్జల్ ఖాన్ పారిపోయే ప్రయత్నం చేయగా గుడారం బైట ఒక్క కత్తివేటుతో
అతన్ని చంపేసాడు.
శివాజీని ఎలాగైనా అణిచేయాలని బిజాపూర్ సుల్తాన్, ఆప్ఘనిస్తాన్‌కు
చెందిన వేల సంఖ్యలో పష్తూన్ సైన్యాన్ని పంపించాడు. వారందరినీ శివాజీ చిన్నసైన్యంతో
మట్టుపెట్టడంతో అతని శౌర్యపరాక్రమాలు దేశమంతా వ్యాపించాయి.
బిజాపూర్ సుల్తాన్ ఎలాగైనా శివాజీని
అంతమొందించాలని మరోసారి అరబ్బులు, పర్షియన్లు, ఆప్ఘన్లతో కూడిన 10వేల మంది
సైన్యంతో దండెత్తాడు. వారిని శివాజీ తన 5వేల మరాఠా సైన్యంతో కొల్హాపూర్ వద్ద
ఎదుర్కొన్నాడు. శత్రుసైన్యాన్ని తుదముట్టించి విజయం కైవసం చేసుకున్నాడు.
శివాజీ పన్హాలా కోటలో అతితక్కువ సైన్యంతో ఉన్నసమయంలో
ఆదిల్షా సైన్యాధ్యక్షుడు సిద్ది జోహార్ ఆ కోటను చుట్టుముట్టాడు. బైటకు రాలేని
పరిస్థితిలో సంధికి ప్రతిపాదించిన శివాజీ, శత్రువు ఆదమరచి ఉన్నపుడు పన్హాలా నుంచి
తప్పించుకున్నాడు. తన మొత్తం సైన్యం ఉన్న విశాలగఢ్ కోటకు చేరుకున్నాడు. అంతవరకూ
శత్రువును నిలువరించిన బాజీప్రభు దేశ్‌పాండే, ఆ యుద్ధంలో అమరుడయ్యాడు. సిద్ధి
జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించిన శివాజీ అతనితో సంధి చేసుకుని పన్హాలా
కోటను వదిలేసాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యానికి స్వతంత్ర రాజ్యంగా
గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత నుంచీ శివాజీ మొగలులతో యుద్ధాలు
చేయాల్సి వచ్చింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ షయీస్తఖాన్కు లక్షమంది
సైన్యాన్నిచ్చి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోమని పంపించాడు.
షయీస్తఖాన్ శివాజీని ఓడించి పుణేను ఆక్రమించాడు. అయితే శివాజీ 1663లో రహస్యంగా
పుణేలోకి ప్రవేశించి షయీస్తఖాన్పై దాడి చేసి అతని చేతివేళ్ళు నరికేసాడు. అక్కడినుంచి
పారిపోయిన షయీస్తఖాన్ను ఔరంగజేబు బెంగాల్ ప్రాంతానికి పంపించేసాడు.
1664లో సూరత్ నగరాన్ని దోచుకుని, శివాజీ మళ్ళీ
సైన్యాన్ని నిర్మించుకున్నాడు. మొగలులు, బిజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా
స్వాధీనం చేసుకోనారంభించాడు. దాంతో ఔరంగజేబు శివాజీపైకి రాజాజైసింగ్ను
ప్రయోగించాడు. అతని బలగాలను ఎదుర్కోలేని శివాజీ జైసింగ్‌తో సంధి చేసుకున్నాడు. బిజాపూర్,
గోలకొండ సుల్తానులను ఓడించాలనే వ్యూహంతో మొగలు సర్దారుగా ఉండడానికి ఒప్పుకున్నాడు.
1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భాన్ని
పురస్కరించుకుని శివాజీని, అతని కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. అక్కడ
వారిద్దరినీ నిర్బంధించాడు. అయితే ఔరంగజేబు చెరనుంచి శివాజీ యుక్తిగా తప్పించుకుని,
రాయగఢ్ చేరుకున్నాడు. కొన్నాళ్ళు ఇరుపక్షాల మధ్యా శాంతి ఒప్పందం కుదిరింది. కొద్దికాలానికే
మొగల్ సేనాధిపతులు మహాబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలావర్ ఖాన్లు మూకుమ్మడిగా
శివాజీపై దాడి చేసారు. కానీ గెలవలేకపోయారు. ఆ తర్వాత నుంచీ ఔరంగజేబు శివాజీని
పట్టించుకోవడం మానేసాడు.
శివాజీ అప్పటినుంచీ తన కార్యక్రమాలను రహస్యంగా
నిర్వహించాడు. లక్షమంది సైన్యాన్ని, అశ్వాలను, భారీ నౌకాదళాన్నీ సమకూర్చుకున్నాడు.
మళ్ళీ మొగలుల కోటలపై దాడులు చేయడం, వాటిని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. 1674
జూన్ 6న రాయగఢ్ కోటలో శివాజీకి పట్టాభిషేకం జరిగింది. నాటినుంచీ ఆయన ఛత్రపతి
అయ్యాడు. ఆ తర్వాత దక్షిణాది ప్రాంతాల మీద సైతం దాడులు చేసి వెల్లూరు, గిండీ
ప్రాంతాలపై విజయం సాధించాడు.
సుమారు మూడు దశాబ్దాల పాటు యుద్ధాలలోనే జీవితం
గడిపి, ముస్లిం నవాబుల పరిపాలనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించి, సువిశాల
హిందూసామ్రాజ్యాన్ని నిర్మించిన మహావీరుడు శివాజీ. 1680 ఏప్రిల్ 3న అనారోగ్యంతో
రాయగఢ్ కోటలో తుదిశ్వాస విడిచాడు. భారతీయమైన వ్యక్తిత్వంతో, సౌశీల్యంతో జీవించిన
గొప్ప పాలకుడు శివాజీ. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజును హిందూపద పాదషాహీ అని
కీర్తించారు.