Supreme Court holds Parliament Committee Proceedings in Sandeshkhali episode
సందేశ్‌ఖాలీ గ్రామస్తులపై అత్యాచారాలకు సంబంధించిన
కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఉన్నతాధికారులపై
పార్లమెంటు కమిటీ ప్రొసీడింగ్స్‌ను నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది.
సుప్రీంకోర్టు ఈ విషయంలో లోక్‌సభ సెక్రటేరియట్‌కు,
పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌కు, కేంద్ర హోంశాఖకు నోటీసులు
జారీ చేసింది. నాలుగు వారాల వ్యవధిలోగా వారి స్పందనలను తెలియజేయాలని సూచించింది.
సందేశ్‌ఖాలీలో మహిళలపై అత్యాచారాల ఘటనల విషయం
బైటకు వచ్చాక బలూర్‌ఘాట్ ఎంపీ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు అయిన సుకాంత మజుందార్
నేతృత్వంలో ఒక బృందం ఆ ప్రదేశానికి సందర్శనకు వెళ్ళింది. అక్కడ పోలీసులు వారిని
అడ్డుకున్నారు. ఆ క్రమంలో సుకాంత మజుందార్‌కు గాయాలయ్యాయి. దాంతో పార్లమెంటు
ప్రివిలేజెస్ కమిటీ ఇవాళ తమముందు హాజరుకావాలంటూ పశ్చిమబెంగాల్ ప్రధాన
కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి, స్థానిక జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి,
స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జికీ ఆదేశాలు జారీ చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, స్థానిక గూండా అయిన
షేక్ షహన్‌షా తన అనుచరులతో కలిసి సందేశ్‌ఖాలీ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు
చెందిన హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకుపోవడం, వారిపై సామూహిక అత్యాచారాలకు
పాల్పడడం వంటి నేరాలు చేస్తున్న విషయం కొద్దిరోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది.
అతని ప్రధాన అనుచరులు ఉత్తమ్ సర్దార్,, శిబు ప్రసాద్ హజ్రాలను పోలీసులు అరెస్ట్
చేసారు. కానీ షేక్ షహన్‌షా మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు.
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్
కొద్దిరోజుల క్రితం సందేశ్‌ఖాలీని సందర్శించారు. అక్కడ పలువురు మహిళలు తాము
ఎదుర్కొన్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ఆయనకు వివరించి చెప్పారు. రాతపూర్వకంగా
ఫిర్యాదులు చేసారు. ఆ ఫిర్యాదులను గవర్నర్ విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి
పంపించారు.
నిజానికి సందేశ్‌ఖాలీలో అంత భయంకరమైన పరిస్థితి
ఏమీ లేదనీ, ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమనీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘శాంతిని
నెలకొల్పడానికి బదులు వారు మంటలు రాజేస్తున్నారు’ అంటూ మమత బీజేపీ వర్గీయులపై
ఆగ్రహం వ్యక్తం చేసారు.
జాతీయ షెడ్యూలు కులాల
కమిషన్ గతవారం సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పర్యటనకు ప్రయత్నించింది. ఆ బృందం రాష్ట్రంలో
రాజకీయ ఉద్రిక్తతలు, హింసాకాండ ఎక్కువస్థాయిలో ఉన్నాయి కాబట్టి పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి
పాలన విధించాలని ఆయనకు సిఫార్సు చేసింది.