ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ (delhi cm kejriwal) ఈడీ విచారణకు ఆరోసారి కూడా హాజరు కాలేదు. ఇప్పటికే ఈడీ అధికారులు అందించిన సమన్ల ప్రకారం ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉంది. మద్యం కుంభకోణం వ్యవహారంలో సీఎం ఈడీ ముందు హాజరుకాకపోవడం అనే వ్యవహారం కోర్టులో ఉన్నందున నోటీసులివ్వడం చట్టవిరుద్దం అంటూ ఆప్ నేతలు ఆరోపించారు.
మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్ తీరుపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు విచారణ జరుగుతోంది. అలాంటి సమయంలో నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్దమంటూ ఆప్ నేతలు చెబుతున్నారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఈడీ ఆగాల్సిందేనని వాదిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఆరుసార్లు సమన్లు జారీ చేశారు.
కేజ్రీవాల్ హాజరుకాకపోవడంపై ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున తాను హాజరు కాలేనని చెప్పడంతో, కేసును మార్చి 16వ తేదీకి వాయిదా వేశారు.