రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణంపై మిస్టరీ వీడటం లేదు. ఆయన మృతదేహంపై గాయాల సంకేతాలున్నాయంటూ ఓ వైద్యుడు మీడియాకు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. జైలులో చనిపోయిన వారి మృతదేహాలను నేరుగా ఫారిన్ మెడిసిన్ బ్యూరోకు తరలిస్తారు. అయితే నావల్నీ మృతదేహాన్ని మాత్రం కొన్ని కారణాల వల్ల క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. నావల్నీ (russia opposition leader death mistery) శరీరంపై మూర్చ సమయంలో నొక్కితే వచ్చే గుర్తులున్నాయని ఓ వైద్యుడు ప్రకటించారు.
నావల్నీ ఆకస్మిక మరణ సిండ్రోమ్ కారణంగా చనిపోయాడని అధికారులు అతడి తల్లి లియుడ్మిలాకు చెప్పారు. ఆమె న్యాయవాదితో సహా జైలుకు వచ్చారు. కానీ నావల్నీ మతదేహాన్ని చూడటానికి అనుమతించలేదు. విచారణ పూర్తి అయ్యే వరకు మృతదేహాన్ని కూడా అప్పగించలేమని అధికారులు చెప్పారు.
నావల్నీని అధికారులే చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే నావల్నీ మృతదేహాన్ని అప్పగించడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నావల్నీ మరణంపై ఆయన భార్య యులియా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నావల్నీ మరణానికి పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన హెచ్చరికలు చేశారు.నావల్నీ అనుమానాస్పద మృతిపై ప్రపంచ దేశాల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.