వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీజేపీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచం గుర్తించిందని, దేశం కోసం ఇంకా పనిచేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనేదే మన నినాదం కావాలన్నారు.
ఇప్పటికే పదేళ్లు ప్రధానిగా చేశారని, విశ్రాంతి తీసుకోవాలని ఓ బీజేపీ సీనియర్ నేత కోరాడని, అయితే తాను రాజకీయాల కోసం, పేరుకోసం మరోసారి ప్రధాని కావాలని ఆకాక్షించడం లేదని, దేశం కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికలకు ప్రతి ఓటరును బీజేపీ నేతలు కలవాలన్నారు.
రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలో నాలుగు అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందన్నారు. దేశంలో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. అంతక ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇండీ కూటమి పని అయిపోయిందన్నారు. కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400పైగా సీట్లు సాధిస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు.