రాజ్ కోట్ టెస్టులోనూ భారత ఓపెనర్
యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. విశాఖ టెస్టులోనూ
డబుల్ సెంచరీ కొట్టిన యశస్వీ, మూడో టెస్టులోనూ పరుగుల వరద సృష్టించాడు. 236 బంతుల్లో 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. 14 ఫోర్లు, 12 సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను
చితకకొట్టాడు.
ఒక టెస్టు ఇన్నింగ్స్ లో
అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ పేరిట ఉన్న రికార్డును
సమం చేశాడు.
భారత్, రెండో ఇన్నింగ్స్ ను 430 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్
చేసింది. ఇంగ్లండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్
ఇన్నింగ్స్ లో లంచ్ తర్వాత సెషన్ లో సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుగైన ఆటతో ఆకట్టుకున్నాడు.
కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ మొదటి ఇన్నింగ్స్ లో మాదిరే రెండో
ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్ లోనూ సర్ఫరాజ్ అర్ధ
శతకంకొట్టాడు.
అంతకుముందు, శుభ్ మన్ గిల్ 91 పరుగుల వద్ద రన్ ఔట్ రూపంలో పెవిలియన్ చేరాడు. నైట్ వాచ్ మన్ గా బరిలో దిగిన
కుల్దీప్ యాదవ్ 27 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్ లీ , రెహాన్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు.
ఈ టెస్టు
మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా… ఇంగ్లండ్ 319 పరుగులకే పెవిలియన్ చేరింది.
దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో126 పరుగుల ఆధిక్యం లభించింది.
సెకండ్
ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 15 పరుగులకే తొలి వికెట్ నష్టపోయింది. బెన్ డకెట్ ను,
కీపర్ ధ్రువ్ జురెల్ రనౌట్ చేయడంతో క్రీజులోకి ఓలీపోప్ వచ్చాడు. జాక్ క్రాలే(11) బుమ్రా
బౌలింగ్ లో ఎల్బీ గా పెవిలియన్ చేరడంతో 18 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్
నష్టపోయింది. రవీంద్ర జడేజా వేసిన 9.4 బంతిని ఆడబోయి ఒలీ పోప్(3) కూడా క్యాచ్ ఔట్
గా వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో (4)
జడేజా బౌలింగ్ ఎల్బీ గా నిష్క్రమించాడు. దీంతో 28 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు
వికెట్లు నష్టపోయింది.