Revolutionary Freedom Fighter Vasudev Balvant Fadke
(స్వతంత్ర సమరయోధుడు ఫడ్కే వర్ధంతి ఇవాళ)
భారతదేశపు స్వతంత్ర సమర యోధుల్లో మరువరాని
మరోపేరు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి
స్వాతంత్ర్యం కావాలని విప్లవమార్గంలో పోరాడిన యోధుడు. తెల్లవారి భయంకర పరిపాలనలో
భారతదేశపు రైతులు పడుతున్న కష్టాలను చూసి తల్లడిల్లిపోయిన ఫడ్కే, స్వరాజ్యం
మాత్రమే అన్ని సమస్యలకూ పరిష్కారమని తలిచాడు. హిందూ సమాజంలోని పలు వర్గాల సహాయంతో
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి రూపకల్పన చేసాడు. ధనికులైన యూరోపియన్
వ్యాపారవేత్తలను దోచుకోవడం ద్వారా ఉద్యమానికి నిధులు సమకూర్చుకునేవాడు. బ్రిటిష్
వారిపై దాడి చేసి పుణే నగరానికి విముక్తి కల్పించడం ద్వారా వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే
పేరు మార్మోగిపోయింది.
వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే 1845 నవంబర్ 4న మహారాష్ట్రలోని
థానే జిల్లా షిర్డాన్ గ్రామంలో (ఇప్పుడు రాయగడ్ జిల్లాలో ఉంది) ఒక నిరుపేద మరాఠీ
చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో పాఠశాల విద్య కంటె మల్లయుద్ధం,
గుర్రపు స్వారీ వంటి విద్యలపై ఆసక్తి చూపేవాడు. చివరికి హైస్కూల్ చదువు
పూర్తిచేయకుండానే ఆపేసాడు. కాలక్రమంలో పుణే నగరానికి చేరి, అక్కడ మిలటరీ అకౌంట్స్
విభాగంలో గుమస్తాగా 15 సంవత్సరాలు పనిచేసాడు. అప్పట్లో పుణేలో ప్రముఖ సామాజికవేత్త
అయిన లహుజీ రఘోజీ సాల్వేను గురువుగా స్వీకరించాడు. సాల్వే గొప్ప మల్లయోధుడు,
మల్లయుద్ధం నేర్పే శిక్షణాకేంద్రాన్ని నిర్వహిస్తుండేవాడు. తెల్లదొరల పాలన నుంచి
దేశానికి స్వాతంత్ర్యం ఎంతో అవసరమని ఆయన బోధిస్తుండేవాడు. సాల్వే మాంగ్ అనే
కులానికి చెందినవాడు. వారిని అప్పట్లో అంటరానివారిగా పరిగణించేవారు. అయితే
ప్రధానస్రవంతి స్వాతంత్ర్యపోరాటంలోకి వెనుకబడిన కులాలవారిని తీసుకురావలసిన ఆవశ్యకత
ఎంతైనా ఉందని అతను ఫడ్కేకు బోధించాడు.
ఫడ్కే అదే సమయంలో మహాదేవ్ గోవింద్ రానడే సభలకు హాజరయ్యేవాడు.
రానడే తన ప్రసంగాల్లో బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు భారతదేశపు ఆర్థిక వ్యవస్థను
ఎలా నాశనం చేస్తున్నాయో సవివరంగా చెప్పేవాడు. తెల్లవారి ఆర్థిక విధానాల వల్ల భారతీయ
సమాజంలో విస్తరిస్తున్న దుష్పరిణామాలను గ్రహించిన ఫడ్కే తీవ్రంగా ఆందోళన చెందాడు.
1870లో ఫడ్కే పుణే ప్రజల సమస్యల గురించి నిర్వహించిన ఒక బహిరంగ ఆందోళన కార్యక్రమంలో
పాల్గొన్నాడు. కొన్నాళ్ళకు ఫడ్కే ఐక్య వర్ధినీ సభ పేరుతో యువతను విద్యావంతులను
చేసే ఒక సంస్థను ప్రారంభించాడు. మిలటరీ అకౌంట్స్ విభాగంలో గుమస్తాగా పనిచేస్తున్నందున,
తన తల్లి మరణకాలంలో ఇంటికి వెళ్ళడానికి అతనికి సెలవు దొరకలేదు. ఆ ఘటన అతని
జీవితాన్నే మార్చేసింది.
బొంబాయి ప్రెసిడెన్సీలో బ్రిటిష్ వారు స్థాపించిన
విద్యాసంస్థ నుంచి ఉత్తీర్ణుడైన తొలితరం గ్రాడ్యుయేట్లలో ఫడ్కే ఒకడు. 1860లో తన
తోటి సమాజసంస్కర్తలు, విప్లవవాదులు అయిన లక్ష్మణ్ నర్హర్ ఇందాపుర్కర్, వామన్
ప్రభాకర్ భావేలతో కలిసి ఫడ్కే పూనా నేటివ్ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థను
స్థాపించాడు. కాలాంతరంలో దానిపేరు మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీగా మార్చారు. ఆ
సంస్థ ద్వారా ఫడ్కే పుణేలో మొదటిసారి భావే స్కూల్ స్థాపించాడు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్
సొసైటీ నేటికీ ఆ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 77 విద్యాసంస్థలు నడుపుతోంది.
1875లో అప్పటి బరోడా సంస్థానాధీశుడు మల్హర్ రావు
గైక్వాడ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం గద్దె దింపేసింది. దాంతో ఫడ్కే బ్రిటిష్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. తీవ్రమైన కరవు, దానికి బ్రిటిష్
పాలకుల నిర్లక్ష్య ధోరణితో దక్కన్ ప్రాంతం అల్లల్లాడుతోంది. దాంతో ఆ ప్రాంతమంతా
ఫడ్కే విస్తృతంగా పర్యటించాడు. తెల్లదొరల పాలన నుంచి దేశం విముక్తం కావలసిన
అవసరాన్ని గురించి వివరిస్తూ ప్రసంగాలు చేసాడు. భారత్‌ను స్వతంత్ర రాజ్యం చేయాలంటూ
ప్రజలకు విజ్ఞప్తి చేసాడు. అయితే విద్యావంతుల నుంచి ఫడ్కేకు మద్దతు రాలేదు. దాంతో
అతను రామోషీ కులానికి చెందిన ప్రజలను సమీకరించడం మొదలుపెట్టాడు. క్రమంగా కోలీలు,
భిల్లులు, ధంగర్లను కూడా తన బృందంలో చేర్చుకున్నాడు. ఫడ్కే ముందుగా తుపాకీ
కాల్చడం, గుర్రపు స్వారీ, కత్తియుద్ధం నేర్చుకున్నాడు. అతను సుమారు 300మందితో ఒక
తిరుగుబాటుదారుల దళాన్ని తయారుచేసాడు. వారి లక్ష్యం తెల్లవారి పాలన నుంచి
భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే.
ఫడ్కే నిజానికి ఒక భారీ సైన్యాన్నే తయారుచేయాలని
భావించాడు. కానీ నిధులు లేవు. దాంతో ప్రభుత్వ ఖజానాలను లూటీ చేయాలని
నిర్ణయించుకున్నాడు. మొదటగా పుణే జిల్లా షిరూర్ తాలూకా ధమారీ గ్రామం మీద
దండెత్తాడు. తెల్ల ప్రభుత్వానికి పంపించడం కోసం వసూలు చేసిన ఆదాయపు పన్ను సుమారు
నాలుగు వందల రూపాయల మొత్తం బాల్చంద్ ఫౌజ్మాల్ సంక్లా అనే స్థానిక వ్యాపారి ఇంట్లో
ఉంది. ఫడ్కే బృందం అతని ఇంటిపై దాడి చేసి ఆ ధనాన్ని తీసుకున్నారు. దాన్ని కరవుతో
అల్లల్లాడుతున్న గ్రామస్తులకు పంచిపెట్టారు. అయితే ఆ ఘటనతో ఫడ్కే మీద దోపిడీదారుడు
అన్న ముద్ర పడింది. అప్పటినుంచీ ఆత్మరక్షణ కోసం ఫడ్కే నిరంతరం పల్లెటూళ్ళలో తిరగడం
మొదలుపెట్టాడు. అతని సానుభూతిపరులైన గ్రామస్తులు ఆశ్రయమిచ్చేవారు. వారందరూ దాదాపు
వెనుకబడిన కులాల వాళ్ళే. స్వాతంత్ర్యం సాధించాలన్న అతని తపన, పట్టుదలకు ముగ్ధులైన
నానాగావ్ గ్రామస్తులు అతనికి దగ్గరలో ఉన్న అడవిలో ఆశ్రయం కల్పించి రక్షణ
ఇస్తామన్నారు.
ఫడ్కే దాడి చేసే విధానం ఏంటంటే ముందుగా బ్రిటిష్
బలగాల సమాచార వ్యవస్థలను అందుబాటులో లేకుండా చేసేవాడు. ఆ తర్వాత దాడి చేసి నిధులు
ఎత్తుకుపోయేవాడు. ఆ నిధులను ప్రధానంగా కరవుబారిన పడి కష్టాల్లో ఉన్న చిన్నకులాలవారికి
పంచిపెట్టేవాడు. పుణేలోని షిరూర్, ఖేడ్ తాలూకాల్లో ఉన్న ప్రాంతాల్లో అలాంటి దాడులు
ఎన్నో చేసాడు ఫడ్కే.
అదే సమయంలో, ఫడ్కే ప్రధాన మద్దతుదారుడు, రామోషీల
నాయకుడు అయిన దౌలత్‌రావు నాయక్ పశ్చిమతీరంలోని కొంకణ్ ప్రాంతానికి వెళ్ళాడు. 1879
మే 10,11 తేదీల్లో వారు పలాస్పే, చిఖాలీ ప్రాంతాల్లో దాడి చేసారు. సుమారు లక్షా
యాభైవేల రూపాయలు దోచుకున్నారు. అక్కడినుంచి ఘాట్ మాథా వైపు తిరిగివస్తుండగా మేజర్
డానియెల్ వారిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో నాయక్ చనిపోయాడు. దౌలత్‌రావు నాయక్
మరణం వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే తిరుగుబాటుకు భారీ నష్టమే కలిగించింది. ఆ దెబ్బతో
ఫడ్కే మరింత దక్షిణంగా తెలుగు నేలకు మళ్ళాడు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని కొలుచుకుంటూ
కొంతకాలం ఉండిపోయాడు. తర్వాత ఫడ్కే మళ్ళీ పోరుబాటకు సిద్ధమయ్యాడు. ఈసారి సుమారు
500 మంది రోహిల్లాలను సమీకరించాడు.
తెల్లదొరల పాలనను అంతమొందించాలంటే ఒకేసారి
పలువైపుల నుంచి వారిపై దాడులు చేయాలని ఫడ్కే ప్రణాళికలు రచించాడు. అయితే ఆచరణలో ఆ
ప్రణాళికలు పూర్తిగా ఫలించలేదు. ఒకసారి ఘనూర్ అనే గ్రామం దగ్గర బ్రిటిష్ సైన్యంతో
ముఖాముఖీ పోరాటం కూడా చేసాడు. ఆ తర్వాత తెల్ల ప్రభుత్వం ఫడ్కే తలకు వెల కట్టింది.
అతన్ని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఫడ్కే దానికి బెదిరిపోలేదు.
పైగా, తను కూడా తెల్లదొరలను పట్టిస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. బొంబాయి గవర్నర్‌ను
పట్టిస్తే ఒక బహుమతి, ఒక్కొక్క యూరోపియన్‌ను చంపితే ఒక బహుమతి… ఇలా తెల్లదొరల
పద్ధతిలో వారి తలలకే వెలలు కట్టాడు. ఆ తర్వాత అతను హైదరాబాద్ రాష్ట్రానికి
వెళ్ళాడు. తన సంస్థలో రోహిల్లాలను, అరబ్బులను చేర్చుకోవాలన్నది అతని ఉద్దేశం. బ్రిటిష్
మేజర్ హెన్రీ విలియం డానియెల్, హైదరాబాద్ నిజాం పోలీస్ కమిషనర్ అబ్దుల్ హక్‌లు
ఇద్దరూ ఎలాగైనా ఫడ్కేను పట్టుకోవాలని ఎన్నో రోజులు కష్టపడ్డారు.
ఫడ్కేను పట్టిస్తే నజరానా ఇస్తామన్న బ్రిటిష్ వారి
ప్రకటన ఫలించింది. ఫడ్కే వెంట ఉండేవారిలోనే ఒకవ్యక్తి అతన్ని మోసం చేసాడు. ఫడ్కే సమాచారం
తెల్లదొరలకు ఇచ్చాడు. దాంతో, 1879 జులై 20న పండరిపురం వెడుతున్న దారిలో కలడ్గి అనే
చిన్న పట్టణంలో ఒక గుడిలో ఉన్న ఫడ్కేను తెల్లసైన్యం చుట్టుముట్టింది. ఫడ్కే భయంకరంగా
పోరాడినా ఫలితం లేకపోయింది. అతన్ని వారు బంధించారు.
అక్కడినుంచి ఫడ్కేను విచారించడం
కోసం పుణే తీసుకువెళ్ళారు. ఫడ్కే తరఫున గణేష్ వాసుదేవ్ జోషి అనే ఆయన వాదించాడు.
ఫడ్కే, అతని సహచరులను సంగం బ్రిడ్జి దగ్గర జిల్లా సెషన్స్ కోర్ట్ జైలు భవనంలో
నిర్బంధించారు. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఫడ్కే తన డైరీలో రాసుకున్నాడు.
అక్కడినుంచి ఫడ్కేను యెమెన్‌లోని ఆడెన్ జైలుకు తరలించారు. 1883 ఫిబ్రవరి 13న ఫడ్కే
ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ కొద్దిసేపటికే పట్టుబడ్డాడు. వాసుదేవ్
బల్వంత్ ఫడ్కే ఆ జైలులో నిరాహార దీక్ష చేసి, ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచాడు.