అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారీ అవినీతిలో కూరుకుపోయారు. మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు కేసులను ఎదుర్కొంటోన్న ట్రంప్‌నకు న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో ట్రంప్‌నకు రూ.3 వేల కోట్ల జరిమానా విధించింది.
అమెరికా అధ్యక్షుడు కాక ముందు ట్రంప్ (donald trump) అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఆస్తుల విలువను వాస్తవిక వాల్యూకంటే అనేక రెట్లు అధికంగా చూపి బ్యాంకు రుణాలు పొంది మోసం చేశాడనే ఆరోపణలు రుజువయ్యాయి. తాజాగా న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నాయకుడు లెటిటియా జేమ్స్ వేసిన కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ తీవ్ర అవకతవకలకు పాల్పడ్డాడని కోర్టు గుర్తించింది, రూ.3 వేల కోట్ల జరిమానా విధించింది.
రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ప్రచారంలో దూసుకుపోతోన్న ట్రంప్‌నకు కోర్టు తీర్పు గొడ్డలి పెట్టులా మారింది. ఇటీవల లైంగిక ఆరోపణల కేసులో కూడా అదనపు పరిహారం చెల్లించాలని మాన్‌హటన్ కోర్టు ఆదేశించింది. లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌నకు కోర్టు రూ.40 కోట్ల జరిమానా విధించింది.