కేంద్రంలో
హ్యాట్రిక్ కొట్టడం ద్వారా భారత రాజకీయాల్లో కొత్తచరిత్రను లిఖించేందుకు భారతీయ
జనతా పార్టీ అస్త్రశస్త్రాలతో సమాయత్తం అవుతోంది. ఓ వైపు మిత్రుల సంఖ్యను పెంచుకుంటూనే
మరో వైపు బీజేపీ బలాన్ని ప్రతీ ఎన్నికకు రెట్టింపు చేసుకుంటోంది.
ఎన్నికల
నిర్వహణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోన్న అగ్రనేతలు, ప్రజలకు చేరువకావడం
ద్వారానే విజయావకాశాలు మెరుగుపడతాయని వివరిస్తున్నారు.
బీజేపీకి
370 ఎంపీ స్థానాలు, ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు స్థానాల్లో గెలవడం లక్ష్యంగా
అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మేధోమథనానికి సిద్ధమయ్యారు.
దిల్లీలోని
భారత్ మండపం వేదికగా నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు జరగనున్నాయి.
భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ లక్ష్యాలు,
వాటి సాధనకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారసరళిపై కేడర్‌కు సలహాలు సూచనలు
అందజేస్తారు.
దేశవ్యాప్తంగా
11,500 మందికి పైగా బీజేపీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి
హాజరవుతున్నారు.
తెలుగు
రాష్ట్రాల నుంచి వందలాది మంది బీజేపీ ముఖ్యనేతలు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్ష ప్రసంగంతో మొదలయ్యే కార్యవర్గం
సమావేశాలు, ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో ముగుస్తాయి.
దేశహితం,
గత పదేళ్ళలో భారత్ సాధించిన పురోగతి, ఎదుర్కోవాల్సిన సవాళ్ళుపై సమావేశాల్లో బీజేపీ
అతిరథ మహారథులు సమాలోచనలు చేస్తారు. రాజకీయ సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలపై
చర్చించి తీర్మానం చేయనున్నారు.