ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ జీఎస్ఎల్వీ – ఎఫ్ 14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ముందుగానే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఇది 27 గంటల 30 నిమిషాలపాటు సాగనుంది. శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా ప్రయోగిస్తోన్న జీఎస్ఎల్వీ వాహకనౌక 2275 కిలోల బరువు కలిగి ఉంది. ఇన్సాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ వాహకనౌక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి, వాతావరణ పరిశీలనకు ఈ ఉపగ్రహం ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కక్ష్యలో ఉన్న ఇన్సాట్ – 3డీ, ఇన్సాట్ – 3డీఆర్ ఉపగ్రహాలతో కలసి ఈ ఉపగ్రహం పనిచేయనుంది.