Gujarat High Court dismisses Kejriwal plea challenging summons
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై వ్యంగ్య
వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు
గుజరాత్ హైకోర్టులో ఊరట లభించలేదు. గుజరాత్ యూనివర్సిటీ వేసిన కేసుకు సంబంధించి
ట్రయల్ కోర్ట్ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు
తిరస్కరించింది.
నరేంద్రమోదీ విద్యాభ్యాసం విషయంలో ఆమ్ ఆద్మీ
పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ గుజరాత్ విశ్వవిద్యాలయం గతేడాది
ఏప్రిల్‌లో స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేసింది. అప్పుడే
కోర్టు కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను
సమీక్షించాలంటూ వారిద్దరూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్ట్, దిగువ
న్యాయస్థానం చర్యలను సమర్ధించింది. దాంతో కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లు స్టే కోరుతూ
హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించాక సుప్రీంకోర్టును
ఆశ్రయించారు. సుప్రీం కూడా వారి అభ్యర్ధనపై విచారణకు తిరస్కరించింది. సెషన్స్
కోర్ట్ కొత్త బెంచ్‌కు ఈ విషయాన్ని అప్పగించి, 10రోజుల్లో విచారణ పూర్తిచేయాలని
హైకోర్ట్ సూచించింది.
ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దుచేయాలంటూ
కేజ్రీవాల్, సంజయ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. ఆ
విషయంపై ట్రయల్ కోర్టులోనే తమ వాదనలు వినిపించుకోవాలంటూ జస్టిస్ హస్ముఖ్ సుతార్ ఆప్
నేతల పిటిషన్లను కొట్టేసారు.