IT dept jolt to Congress, freezes accounts, later defreezes
కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను విభాగం పెద్ద షాక్
ఇచ్చింది. ఆ పార్టీ ప్రధాన అనుబంధ సంఘాలకు సంబంధించిన తొమ్మిది ఖాతాలను సీజ్
చేసింది.
తాము పంపిన నోటీసులకు ఆ సంఘాలు స్పందించలేదని, జరిమానా
కూడా చెల్లించలేదని, అందువల్లనే ఖాతాలు సీజ్ చేసామనీ ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. 2018-19లో ఐటీ విభాగం విధించిన జరిమానా, నోటీసులకు
ఇప్పటి వరకూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు స్పందించ లేదని వివరించింది.
ఖాతాల నిలుపుదలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్పందింపజేయడమేంటని కోశాధికారి అజయ్ మాకెన్
ప్రశ్నించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బును సైతం సీజ్ చేశారన్నారు.
“దేశ చరిత్రలో తొలిసారి, ప్రధాన
ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ఆదాయపన్ను అధికారులు సార్వత్రిక
ఎన్నికల ప్రకటనకు కేవలం రెండు వారాల ముందు పనికిమాలిన
కారణాలతో స్తంభింపజేశారు” అంటూ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్ననే ఎన్నికల
బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో రాజకీయ పార్టీలకు ఫండింగ్
నిలిచిపోయింది. ఆ నేపథ్యంలో అకౌంట్లను సీజ్ చేయడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు
గురిచేసింది.
తమ చెక్కులను బ్యాంకులు తీసుకోవడంలేదని సమాచారం
అందినట్లు మాకెన్ తెలిపారు. యూత్
కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుంచి రూ.210
కోట్లు రికవరీ చేయాలని ఆదాయపు పన్ను విభాగం అడుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికలకు
రెండు వారాల ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమే
అని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం తమ వద్ద నగదు లేదని, విద్యుత్
బిల్లులు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకైనా నిధులు లేవని
చెప్పారు. ఈ చర్య రాహుల్ గాంధీ న్యాయ యాత్ర, కాంగ్రెస్ ఇతర రాజకీయ కార్యక్రమాలపై
ప్రభావం చూపుతుందన్నారు.
అయితే, ఆదాయపన్ను విభాగం కాంగ్రెస్ పార్టీకి పాక్షికంగా ఉపశమనం
కలిగించింది. ఇప్పటికే పార్టీ విజ్ఞప్తి మేరకు ఆదాయపు పన్ను అప్పిలేట్
ట్రిబ్యునల్లో ఈ అంశంపై ఇవాళ విచారణ జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ న్యాయవాది
వివేక్ తంఖా హాజరయ్యారు. ట్రిబ్యునల్ నిర్దేశించినట్లు
తాత్కాలికంగా కాంగ్రెస్ తన ఖాతాలను నిర్వహించగలదని ఆయన చెప్పారు. మధ్యంతర ఉపశమనం కోసం చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం ఫిబ్రవరి
21న పరిశీలిస్తుంది.