కాంగ్రెస్
పార్టీ పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. బంధుప్రీతి
వంశపారంపర్య రాజకీయాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా నేతలు
వీడుతున్నారని చెప్పారు. మోదీని ఎదుర్కోవడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యమని ఎద్దేవా
చేశారు.
వికసిత్
భారత్, వికసిత్ రాజస్థాన్ కార్యక్రమంలో భాగంగా జైపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను
వర్చువల్ గా ప్రారంభించిన మోదీ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రూ.17 వేల కోట్ల
విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
‘‘
కాంగ్రెస్ కు మోదీ వ్యతిరేక అజెండా మాత్రమే ఉంది. మోదీ పేరిట సమాజాన్ని విభజించే
ప్రయత్నం చేస్తోంది. వారసత్వ రాజకీయాలు, రాజరికపు ఆలోచనలు ఉన్న పార్టీ ఇంతకంటే
ఇంకేం చేయగలదు’’ అని మోదీ దయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒకే కుటుంబం
కనబడుతుందన్నారు, నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారని గుర్తు చేశారు.
సానుకూల
రాజకీయాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం కాంగ్రెస్ కు అతిపెద్ద లోపం అంటూ చురకలు
అంటించారు.ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు.
భారత్
ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలు,
యువత, రైతులు, పేదలకు మరింత మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు
చేస్తుందన్నారు. వికసిత్ భారత్ అనేది కేవలం నినాదం కాదన్న మోదీ, ప్రత్యేక
భావోద్వేగమని భాష్యం చెప్పారు. పేదరికాన్ని రూపుమాపి, ప్రజలందరి జీవితాల్లో
వెలుగులు నింపే ప్రచారం కార్యక్రమం అన్నారు. యువతకు ఉపాధి, దేశ ప్రజలందరికీ ఆధునాతన
సదుపాయాలు కల్పించేందుకు శ్రమిస్తున్నామన్నారు.