Kerala High Court rejects plea to halt investigations in graft cases
కేరళ రాష్ట్రప్రభుత్వ సంస్థలు కేఎస్ఐడీసీ,
కేఎంఆర్ఎల్, ప్రైవేటు సంస్థ ఎగ్జాలాజిక్ సొల్యూషన్స్ మధ్య లావాదేవీల్లో అవినీతిపై
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును నిలిపివేయాలంటూ కేఎస్ఐడీసీ
వేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. ఎగ్జాలాజిక్ సంస్థ కేరళ సీఎం
పినరయి విజయన్ కూతురు, మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ భార్య అయిన వీణా విజయన్ సొంత కంపెనీ.
కేఎస్ఐడీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ దర్యాప్తు గురించి ఎందుకు ఆందోళన చెందుతోందని
హైకోర్టు ప్రశ్నించింది.
కేరళ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం, గతంలో
కర్ణాటక హైకోర్టు తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్నే గుర్తు చేసింది. ఆ రాష్ట్రపు
కోర్టు కూడా, సీఎంఆర్ఎల్ అనే సంస్థతో ఎగ్జాలాజిక్ ఆర్థిక లావాదేవీల విషయంలో
ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తును నిలిపివేయాలని అభ్యర్ధించింది. ఈ తీర్పులు ముఖ్యమంత్రి
పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా విజయన్ ఇద్దరికీ పెద్ద ఎదురుదెబ్బే. పైగా,
ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కోసం అడిగే అన్నిడాక్యుమెంట్లనూ వెంటనే సమకూర్చాలని కూడా కర్ణాటక
హైకోర్టు ఎగ్జాలాజిక్కు సూచించింది.
అవినీతి కేసులో దర్యాప్తు జరిగితే సంస్థ ప్రతిష్ఠకు
నష్టమని కేఎస్ఐడీసీ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, వాస్తవాలను తెలుసుకోడం
కోసం సరైన, నిఖార్సైన దర్యాప్తు జరిగితే కేఎస్ఐడీసీకే మంచిది కదా అని హైకోర్టు ప్రశ్నించింది.
నిందితుల జాబితాలోనుంచి కేఎస్ఐడీసీని తొలగించడానికి ఆ దర్యాప్తు తోడ్పడుతుందని
హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తుకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం వెనుక స్వార్థ
ప్రయోజనాలు ఉండి ఉండవచ్చని భావించింది.
కేఎస్ఐడీసీ కేరళలోని ప్రభుత్వ రంగ సంస్థ. దానికి
సీఎంఆర్ఎల్లో షేర్లున్నాయి. సీఎంఆర్ఎల్ బోర్డులో కేఎస్ఐడీసీకి ఒక నామినీ
డైరెక్టర్ ఉన్నారు. సీఎంఆర్ఎల్ సంస్థ వీణా విజయన్‌కు చెందిన ఎగ్జాలాజిక్ కంపెనీకి
నెలవారీ చెల్లింపులు చేస్తూంటుంది. సీఎంఆర్ఎల్ సంస్థ వీణా విజయన్ సంస్థకు,
వ్యక్తిగతంగా వీణకు కూడా అక్రమ చెల్లింపులు చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ
కనుగొంది. సీఎంఆర్ఎల్ కూడా ఆ చెల్లింపులను ధ్రువీకరించింది. కొంతమంది మధ్యవర్తుల
ద్వారా రాజకీయనాయకులకు ఆ మొత్తం వెడుతోందని ఒప్పుకుంది. ఒక రాజకీయ నాయకుడి పేరును
పీవీ అని చెప్పింది. దాంతో కేరళలో రాజకీయ అలజడి మొదలైంది. ఆ నాయకుడు ఎవరో కాదు…
రాష్ట్ర ముఖ్యమంత్రి, వీణ తండ్రి అయిన పినరయి విజయనే అని ప్రతిపక్షాలు రగడ
ప్రారంభించాయి. మరికొందరు కాంగ్రెస్ నాయకులకు కూడా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలూ
వచ్చాయి.
ఆ అవినీతి కేసులో ఆధారాలు సేకరించడానికి సీరియస్
ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ప్రారంభించింది. దాంతో సున్నితమైన
సమాచారం బైటపడిపోతుందని నిందితులు భయపడ్డారు. అందువల్ల ఆ కేసు దర్యాప్తును ఎలాగైనా
ఆపాలన్నది వారి ప్రధాన లక్ష్యమైంది. ఐతే కర్ణాటక, కేరళ హైకోర్టుల తీర్పులు వారి
వ్యూహానికి దెబ్బకొట్టాయి. నిందితులు బోలెడంత డబ్బు ఖర్చుచేసి చాలా పెద్దస్థాయి
లాయర్లను పెట్టుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ వ్యవహారంలో లింకులు బైటపడుతున్న కొద్దీ అసలు ఏం
జరిగి ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి తన పదవిని దుర్వినియోగం చేసి సీఎంఆర్ఎల్
సంస్థకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని మార్చారని, దానికి ప్రతిగా
ఆ సంస్థ ఆయన కూతురికి లబ్ధి చేకూరుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆ అక్రమ వ్యవహారాలు
బైటపడితే తన పదవికి ముప్పు వాటిల్లుతుందని సీఎం పినరయి విజయన్ ఆందోళనగా ఉన్నారన్న
అనుమానాలు పెరుగుతున్నాయి. తను ఏ తప్పూ చేయలేదనీ, తన కుటుంబాన్ని వివాదాల్లోకి
లాగితే సహించబోననీ పినరయి విజయన్ చెబుతున్నా, ఆ వాదనను ఎవరూ నమ్మడం లేదు.
కేఎంఆర్ఎల్, ఎగ్జాలాజిక్ మధ్య ఆర్థిక లావాదేవీలపై
ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, దర్యాప్తు జరగాల్సిందేనని కోర్టులు స్పష్టం చేసినా, ఆ
వ్యవహారంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కానీ, అధికార పక్షం సీపీఎం కానీ సరైన
జవాబులు ఇవ్వడం లేదు. వీణా విజయన్ ఒక యువ పారిశ్రామికవేత్త అనీ, తన వ్యాపారాలు
చేసుకోడానికి తనకు హక్కులున్నాయనీ సీపీఎం వాదిస్తోంది. అయితే తనమీద వస్తున్న
ఆరోపణల గురించి వీణా విజయన్ కిమ్మనడం లేదు. నిందితుల తరఫున న్యాయస్థానాల్లో
వాదించడానికి పెద్దమొత్తంలో ఖర్చుపెడుతుండడం, నిందితులపై వచ్చిన ఆరోపణలు
వాస్తవమేనన్న అంచనాలకు అవకాశం కల్పిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పినరయి విజయన్, అధికార పార్టీ సీపీఎం
మాత్రం వీణ కంపెనీ మీద రాజకీయ దాడి జరుగుతోందంటూ అవినీతి ఆరోపణలను
కొట్టిపారేస్తున్నాయి. ‘నెలవారీ చెల్లింపుల’ అంశాన్ని తగ్గించి చూపే ప్రయత్నాలు
జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో అత్యధికులు, ముఖ్యమంత్రి రకరకాల మార్గాల్లో
అవినీతికి పాల్పడే ఉంటారని, వాటిలో భాగంగానే సీఎం కుమార్తెకు చెల్లింపులు
జరుగుతున్నాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమార్తె తాము అమాయకులం అని నోటిమాటగా
చెప్పడం వారి అమాయత్వాన్ని నిరూపించబోదు. వారు ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తుకు పూర్తిగా
సహకరించాలని కేరళ ప్రజలు భావిస్తున్నారు.