Farmers Protest: Bharat Bandh today, discussions on Sunday evening
ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ వైపు తమ యాత్రను
కొనసాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం సామరస్యపూర్వకంగా చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని
భావిస్తోంది. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో, తదుపరి చర్చలు ఆదివారం నిర్వహించాలని
నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇవాళ శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని సంయుక్త
కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశవ్యాప్తంగా
రైతులు తమ వ్యవసాయ పనులు మానేసి, రహదారులను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా
పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నోయిడా, గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా సహా ఢిల్లీ
చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో గుంపులు గుమిగూడడంపై నిషేధం విధించారు. భారత్ బంద్‌కు
ట్రేడ్ యూనియన్లు మద్దతు పలికాయి. ఆ సంస్థలు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో పాల్గొనడం
లేదు. అయితే వారి డిమాండ్లు కూడా దాదాపు కిసాన్ మోర్చా డిమాండ్లలానే ఉన్నాయి.
తొమ్మిది జాతీయ ట్రేడ్ యూనియన్ల సీనియర్ నాయకులు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఉమ్మడి నిరసన దీక్ష చేపడతారు. మొత్తం 21 డిమాండ్లను
నెరవేర్చాలని వారి వాదన. అందులో అన్ని పంటలకూ కనీస మద్దతు ధర, కనీస పింఛను, కనీస
కూలిధరల కోసం చట్టం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్.
హర్యానా రోడ్‌వేస్ ఉద్యోగులు భారత్ బంద్‌కు
మద్దతు ప్రకటించారు. మూడు గంటల పాటు అన్ని టోల్ బూత్స్ తెరిచి ఉంచేస్తారు. అయితే
కార్యాలయాలు, బ్యాంకులు మాత్రం యధావిధిగా పనిచేస్తాయి.
పంజాబ్ హర్యానా సరిహద్దుల దగ్గర రైతులు పోలీసుల
మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. రైతులు ఢిల్లీవైపు వెళ్ళి తీరాల్సిందేనంటూ పట్టు
పట్టి కూర్చున్నారు. వేలమంది రైతులు కొన్ని
నెలలకు సరిపడా సరుకులు, డీజిల్‌తో మంగళవారం నాడు తమ ఢిల్లీ యాత్ర మొదలుపెట్టారు.
చండీగఢ్‌లో మూడో విడత చర్చలు జరిగాయి.
కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్ సహా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ
సమావేశంలో పాల్గొని చర్చించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మళ్ళీ చర్చలు
జరుగుతాయని అర్జున్ ముండా వెల్లడించారు. ఆ సమావేశంలో సమస్యకు పరిష్కారం
లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, పలు
అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందనీ భగవంత్ మాన్ చెప్పారు.
ఇవాళ్టి భారత్ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని
రైతులు హామీ ఇచ్చారని భగవంత్ మాన్ వెల్లడించారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం తమ
పోలీసులను పంజాబ్‌లోకి పంపిస్తోందని కూడా ఆరోపించారు.
చర్చలు ఇంకా పూర్తి
కానందున, ఏ నిర్ణయమూ తేలనందున తమ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని
రైతులు చెబుతున్నారు. తమపై పోలీసుల చర్యలను, తమ సోషల్ మీడియా పేజీలను
తొలగించడాన్నీ వారు తప్పుపడుతున్నారు.
కనీస
మద్దతు ధర, రైతు రుణాల మాఫీ వంటి అంశాలపై ప్రభుత్వం మరింత చర్చించాలని కోరుతోందని రైతులు
వెల్లడించారు. అయితే నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కారం కోసం ప్రయత్నించాలని వారు
డిమాండ్ చేస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు