Ratha Saptami Special
మాఘ
శుద్ధ సప్తమి నాడు సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమి ఉత్సవాన్ని తెలుగు ప్రజలు
శాస్త్రోక్తంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
జరుగుతున్నాయి. అరసవిల్లిలో శ్రీ సూర్య నారాయణ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఏడాదికి ఒక రోజున దర్శనమిచ్చే స్వామిని దర్శించుకునేందుకు రాత్రి 8 గంటల నుంచే
భక్తులు క్యూలో నిలుచున్నారు. ఆదిత్యుడి
నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సామాన్య భక్తులతో పాటు ఉత్తరాంధ్రకు
చెందిన వ్యాపార, రాజకీయ ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.
అర్ధరాత్రి
తర్వాత జయంతి ఉత్సవానికి వేదపండితులు
అంకురార్పణ చేశారు. మూలవిరాట్ కు క్షీరాభిషేకం నిర్వహించారు.
కలియుగ
దైవం శ్రీ వేంకటేశుడు కొలువైన తిరుమలలో కూడా రథ సప్తమి వేడుకలు వైభవంగా
జరుగుతున్నాయి. మలయప్ప స్వామికి నేడు ఏడు వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే
సూర్యప్రభ వాహనం, చిన్న శేష వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు.
స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై విహరిస్తున్నందున
రథ సప్తమి రోజును అర్ధ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహనంతో
వాహన సేవలు ముగియనున్నాయి.
బెజవాడ
ఇంద్రకీలాద్రిపై వేంచిసిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి కూడా భక్తులు
తరలివచ్చారు. రక్షణ శాఖ సలహాదారుడు సతీశ్
రెడ్డి, దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు
చేశారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.
కృష్ణా
జిల్లా మోపిదేవిలో వైభవంగా శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రథోత్సవం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి
బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.