BJP constitutes six member committee on Bengal rape incidents
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో
మహిళలపై అత్యాచారాలు, హింసాకాండ ఘటనల గురించి సమాచారం సేకరించడానికి భారతీయ జనతా
పార్టీ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆ
కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవి కమిటీ కన్వీనర్‌గా
వ్యవహరిస్తారు. ప్రతిమా భౌమిక్, బీజేపీ ఎంపీలు సునీతా దుగ్గల్, కవితా పటీదార్,
సంగీతా యాదవ్, బ్రిజ్‌లాల్ ఆ కమిటీలోని మిగతా సభ్యులు. వారు సందేశ్‌ఖాలీని
సందర్శించి, అక్కడి పరిస్థితి గురించి సమాచారం సేకరిస్తారు. బాధితులతో
మాట్లాడతారు. తమ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేస్తారు.
ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ జేపీ నడ్డా ‘‘పశ్చిమబెంగాల్లో జరుగుతున్న
ఘటనలు హృదయవిదారకంగా ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, గైండాగిరీ ఆ
రాష్ట్రంలో నిరంతరాయంగా జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవలసిన ప్రభుత్వం మౌనంగా
ఉండిపోయింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’’
అన్నారు.
సందేశ్‌ఖాలీలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక
వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ పశ్చిమబెంగాల్ శాఖ అధ్యక్షుడు సుకాంత
మజుందార్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రదర్శనను
అణచివేయడానికి పోలీసులు లాఠీచార్జి చేసారు. ఆ క్రమంలో సుకాంత మజుందార్ గాయపడ్డారు.
ఆ నేపథ్యంలో సందేశ్‌ఖాలీ సహా ఏడు గ్రామపంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19 వరకూ
సెక్షన్ 144 విధించింది.