Supreme Court strikes down electoral bonds, calling them anti constitutional
రాజకీయ పార్టీలు నిధులు సమీకరించే ఎన్నికల బాండ్ల
పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ పథకం సామాన్య పౌరుల సమాచార
హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్
నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని
స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు, దాతల మధ్య పరస్పర ప్రయోజనాల బంధం ఏర్పడే
అవకాశముందని గమనించింది. ఒకపక్క నల్లధనంపై పోరాటం అంటూ మరోవైపు పార్టీలకు
విరాళాలిచ్చే దాతల వివరాలను దాచిపెట్టడం సరి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
నల్లధనాన్ని అరికట్టడానికి బాండ్లు ఒక్కటే మార్గం కాదని చెప్పుకొచ్చింది.
ఎన్నికల బాండ్ల జారీని తక్షణం నిలిపివేయాలని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సీజేఐ ఆదేశించారు. ఈ పద్ధతిలో ఇప్పటివరకూ ఇచ్చిన
విరాళాల వివరాలను భారత ఎన్నికల సంఘానికి తెలియజేయాలని ఎస్‌బీఐకి ఆదేశాలు జారీ
చేసారు. ఆ సమాచారాన్ని మార్చి 31లోగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉంచాలని
కమిషన్‌ను ఆదేశించారు.
సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు సంజీవ్ ఖన్నా,
బీఆర్ గవాయ్, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏకగ్రీవ తీర్పునిచ్చింది.
‘‘మేమందరం ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఈ అంశంలో రెండు అభిప్రాయాలు వచ్చాయి. నాదొకటి,
సంజీవ్ ఖన్నాది రెండవది. అయితే మా ఇద్దరి అభిప్రాయాల ఫలితమూ ఒక్కటిగానే ఉంది’’ అని
సీజేఐ తెలిపారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి బాండ్లను
కొనుగోలు చేయడం వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందనే భావనతో నరేంద్ర మోదీ
ప్రభుత్వం ఈ పద్ధతిని 2018 జనవరి 2న ప్రవేశపెట్టింది. అయితే, రాజకీయ పార్టీలు తాము
స్వీకరించిన విరాళాల వివరాలను బైటపెట్టాల్సిన అవసరం లేదంటూ 2017లో సవరణ చేసింది.
దాంతో ఎన్నికల బాండ్ల పద్ధతిలో పారదర్శకత లోపించిందంటూ ఈ పథకాన్ని సవాల్ చేసారు.
కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు, మరికొందరు వ్యక్తులు వేసిన పిటిషన్‌ను
విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.