Goddess Saraswati Idol with no robes on Vasant Panchami day
త్రిపుర రాజధాని అగర్తలాలో సరస్వతీదేవికి అవమానం
జరిగింది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా బుధవారం నాడు స్థానిక ప్రభుత్వ కళాశాలలో సరస్వతీ
పూజ వేడుకలు నిర్వహించారు. అయితే కళాశాల విద్యార్ధులు సరస్వతీ దేవి విగ్రహాన్ని
చీర లేకుండా తయారుచేసారు. అసభ్యంగా ప్రదర్శించారు. ఆ విషయం తెలిసిన ఏబీవీపీ
విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.
అగర్తలాలోని గవర్నమెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
కాలేజ్ విద్యార్ధులు కళాశాలలో సరస్వతీ పూజ వేడుకల కోసం తామే స్వయంగా చదువులతల్లి
విగ్రహాన్ని రూపొందించారు. అయితే దాన్ని దుస్తులు లేకుండా తయారుచేసారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్
చేసారు. దాన్ని చూసిన ఏబీవీపీ విద్యార్ధులు, సరస్వతీ మాత విగ్రహాన్ని అసభ్యంగా
ప్రదర్శించడం సరి కాదంటూ కళాశాలలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసున్న స్థానిక
బజరంగ్ దళ్ సభ్యులు సైతం అక్కడికి చేరుకుని ఆందోళన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఆ ఆందోళనలకు త్రిపుర ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి
దిబాకర్ ఆచార్జీ నేతృత్వం వహించారు. ‘‘వసంత పంచమి పర్వదినాన సరస్వతీదేవిని పూజించుకోవడం
దేశమంతటా ఆనవాయితీ. అయితే ఇక్కడి గవర్నమెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజ్‌లో
అమ్మవారి మూర్తిని చాలా తప్పుడు పద్ధతిలో అసభ్యంగా తయారుచేసి పెట్టారు. ఆ విషయం
మాకు ఈ ఉదయమే తెలిసింది’’ అని దిబాకర్ చెప్పారు.
ఆందోళనల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం సరస్వతీ దేవి
విగ్రహాన్ని ఒక చీరతో చుట్టి మూసివేసారు. ఐతే ఏబీవీపీ ఈ సంఘటనను అంత తేలిగ్గా
వదిలేయలేదు. కళాశాల యాజమాన్యం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, త్రిపుర ముఖ్యమంత్రి
మాణిక్ సాహా ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకోవాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.
కళాశాల వర్గాలు మాత్రం తమకు ఎవరి మతవిశ్వాసాలను,
మనోభావాలనూ దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని చెబుతోంది. హిందూ దేవాలయాలపై ఉండే
సంప్రదాయిక శిల్ప పద్ధతుల ప్రకారమే తమ కళాశాల విద్యార్ధులే ఈ విగ్రహాన్ని తయారుచేసారని
సమర్ధించుకుంది. ఏ మత విశ్వాసాలనూ కించపరిచే ఉద్దేశం తమకు లేదంటూనే, ప్రాచీనకాలంలో
విగ్రహాలు ఎలా ఉండేవో అలాగే తయారుచేసామనీ, అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదని వాదించింది.
ఎట్టకేలకు ఆ విగ్రహానికి ప్లాస్టిక్ షీట్లు వేసి పూజాపండాల్‌లో వెనక్కు తోసేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు
సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఏబీవీపీ ఇంకా బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు
లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు.
వసంతపంచమి రోజు సరస్వతీదేవి మూర్తిని అసభ్యంగా ప్రదర్శించడం వెనుక కుట్ర ఉందేమో
అని అనుమానిస్తున్నారు.