PM Modi inaugurates first Hindu temple in Abudabhi
మధ్యప్రాచ్యంలోని భారతీయహిందువుల కలలు సాకారమయ్యాయి. అబూదాభీలోని మొట్టమొదటి హిందూ
దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
27 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ
మందిరం భారత్-యుఎఇ దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రెండురోజుల పర్యటనలో రెండోరోజు భారత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన కతార్ బయలుదేరి
వెళ్ళారు.
దేవాలయ ప్రారంభోత్సవానికి ముందు మోదీ యుఎఇలోని ప్రవాసభారతీయుల
సదస్సులో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అల్ నహ్యాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 2015లో అప్పటికి యువరాజుగా ఉన్న నహ్యాన్తో
చర్చల సందర్భంలో యుఎఇలో ఆలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేయడానికి నహ్యాన్
ఒప్పుకున్నారని మోదీ వెల్లడించారు.
‘‘ఇక్కడ ఆలయ నిర్మాణం భారతదేశం పట్ల మీ ప్రేమకు, యుఎఇ
బంగారు భవిష్యత్తు గురించిన మీ దార్శనికతకు నిదర్శనం. మీ అండదండలు లేకుండా ఈ
నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు. మన మొదటి సమావేశంలో నేను ఈ విషయం గురించి మిమ్మల్ని
అడిగాను. అప్పుడు మీరు ఎంతో సరళంగా ఒప్పుకున్నారు. ‘మీకు ఎక్కడి భూమి కావాలో
చూపించండి, అది మీదవుతుంది’ అని చెప్పారు, అలాగే ఇచ్చారు’’ అని మోదీ నహ్యాన్‌ను
ప్రశంసించారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం అల్ నహ్యాన్ 2015లో 13.5 ఎకరాల భూమిని
దానం చేసారు. 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
చేసారు. 2019లో ఆలయ నిర్మాణం మొదలైంది. అప్పుడు మరో 13.5 ఎకరాల స్థలాన్ని దానం
చేసారు.
బొచాసన్‌వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ
నిర్మించిన ఈ ఆలయం అల్ రహబా దగ్గర ‘అబూ రెకా’ అనే ప్రదేశంలో ఉంది. యుఎఇలోని ఏడు
ఎమిరేట్స్‌కు (రాష్ట్రాల వంటివి) చిహ్నంగా ఈ ఆలయంలో ఏడు శిఖరాలు నిర్మించారు. ఆ
శిఖరాలపై రాముడు, శివుడు, జగన్నాథుడు, కృష్ణుడు, స్వామి నారాయణుడు, తిరుపతి
వేంకటేశ్వరుడు, అయ్యప్ప వంటి దేవతామూర్తులను తీర్చిదిద్దారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు
యుఎఇని సందర్శించారు. గత ఎనిమిది నెలల్లో ఇది మూడో పర్యటన. ఈ ఉదయం ఆయన దుబాయ్‌లో ప్రపంచ
ప్రభుత్వాల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దుబాయ్ కేంద్రస్థానంగా
మారుతోందన్న మోదీ, దానికి కారణం యుఎఇ అధ్యక్షుడు అల్ నహ్యాన్ దూరదృష్టి, పట్టుదలే అంటూ
ఆయనను ప్రశంసించారు.
నరేంద్రమోదీ గురువారం దోహాలో కతార్ దేశ నాయకులతో ద్వైపాక్షిక
చర్చలు జరుపుతారు. ఇటీవలే గూఢచర్యం కేసులో మరణశిక్ష పడిన 8మంది భారతీయులను కతార్
దేశం క్షమించి విడిచిపెట్టేసింది. అది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం.