శ్రీ సూర్య నారాయణ స్వామి జయంతి సందర్భంగా
ఫిబ్రవరి 16న
రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రథసప్తమి
పర్వదినం సందర్భంగా స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడంతో
దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని, ఒకరోజు
బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తుంటారు.
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ,
సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం
కల్పిస్తున్న టీటీడీ, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనాలు రద్దు చేసింది.
ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు తిరుపతిలోని
కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన
టైంస్లాట్లు పాటించకపోతే వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు.
రథసప్తమి రోజున శ్రీ
మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై విహరిస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనాలపై నుంచి భక్తులను కటాక్షిస్తారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై నుంచి భక్తులను
ఆశీర్వదిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు.